ఎప్ స్టీన్ ఫైల్స్ లో నరేంద్ర మోడీ పేరు.. అసలేం జరిగింది!
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆయన ఇజ్రాయెల్ అధికారిక పర్యటన గురించి ఎప్ స్టీన్ ఫైల్స్ లో ప్రస్థావించారనే విషయం తీవ్ర కలకలం రేపింది!;
ఎప్ స్టీన్ సెక్స్ కుంభకోణం ఫైల్స్ అగ్రరాజ్యంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పైగా తాజాగా విడుదల చేసిన సుమారు 30 లక్షల పేజీలతో పాటు 1,80,000 ఫోటోలు, 2,000 వీడియోలలో అనేక మంది ప్రముఖుల ప్రస్థావన వచ్చింది! ఇందులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మాజీ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ తో పాటు బిల్ గేట్స్, ఎలాన్ మస్క్, బ్రిటన్ మాజీ యువరాజు ఆండ్రూల పేర్లు తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ సమయంలో మోడీ ప్రస్థావన రావడం గమనార్హం.
అవును... ఎప్ స్టీన్ సెక్స్ స్కామ్ వ్యవహారం అమెరికాలో ప్రకంపనలు, ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న పరిస్థితి. తనకు తాను పంపుకున్న ఈ మెయిల్స్ లో జెఫ్రీ ఎప్ స్టీన్ చెప్పినవన్నీ వాస్తవాలా కాదా అనే సంగతి కాసేపు పక్కనపెడితే... ఇప్పుడు ఇందులో పొందుపరచబడిన పేర్ల వ్యవహారం మాత్రం చర్చనీయాంశంగా మారుతోంది. ఈ క్రమంలో రష్యా మహిళతో తనకు సంబంధం ఉందని, ఫలితంగా తనకు సుఖ వ్యాధులు వచ్చాయంటూ ఆరోపించడాన్ని బిల్ గేట్స్ తీవ్రంగా ఖండించిన పరిస్థితి. ఈ సమయంలో మోడీ ప్రస్థావనను భారత్ తీవ్రంగా ఖండించింది.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆయన ఇజ్రాయెల్ అధికారిక పర్యటన గురించి ఎప్ స్టీన్ ఫైల్స్ లో ప్రస్థావించారనే విషయం తీవ్ర కలకలం రేపింది! ఈ సమయంలో ఈ వ్యవహారంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఈ వాదనలు పూర్తిగా నిరాధారమైనవని పేర్కొంది! ప్రధానమంత్రి ఇజ్రాయెల్ పర్యటన గురించి ప్రస్థావించిన ఎప్ స్టీన్ ఫైల్స్ కు లింక్ చేయబడినట్లు చెప్పబదుతున్న ఓ ఈ-మెయిల్ సందేశాన్ని ప్రభుత్వం గమనించిందని.. విదేశాంగ శాఖ ప్రతినిధి వెల్లడించారు. అందులో ప్రధాని పర్యటన తప్ప మిగిలిన విషయాలన్నీ పూర్తిగా ఖండించదగినవని తెలిపారు!
ఈ సందర్భంగా స్పందించిన విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్ ధీర్ జయస్ వాల్ స్పందిస్తూ... ఒక శిక్ష పడ్డ ఖైదీ చేసిన ఆరోపణలకు విలువే లేదని వ్యాఖ్యానించారు. ఇదే క్రమంలో.. 2017 జూలైలో ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ లో పర్యటించారన్న వాస్తవం తప్ప ఎప్ స్టీన్ ఫైల్స్ లో ఉన్న మిగిలిన విషయం అంతా పూర్తిగా తప్పని.. అదో చెత్త పుకారని స్పష్టం చేశారు. మరోవైపు... ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ నేతలు మండిపడ్డారు. కాగా.. ఎప్ స్టీన్ ఫైల్స్ లో మోడీ పేరు ప్రస్థావించడం దేశానికి అవమానమని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు!
కాగా... 1992లో భారత్ - ఇజ్రాయెల్ మధ్య పూర్తి దౌత్య సంబంధం ఏర్పడిన తర్వాత.. 2017 జూలైలో ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ లో పర్యటించారు. దీంతో.. ఆ దేశంలో ఒక భారత ప్రధానమంత్రి అడుగు పెట్టడం ఇదే తొలిసారిగా రికార్డ్ నమోదైంది! అయితే.. ఎప్ స్టీన్ దర్యాప్తు ఫైళ్ల నుంచి యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టీస్ కొత్త రికార్డులను విడుదల చేసిన కొన్ని గంటల తర్వాత ఈ పర్యటనకు సంబంధించిన ప్రస్థావన విషయం తెరపైకి వచ్చింది!