ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాల్సిందే !
ఈ నేపధ్యంలో దేశంలోనే తొలిసారిగా ఒక రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సరికొత్త నిబంధనలను తీసుకుని రాబోతున్నారు.;
సోషల్ మీడియా వర్తమాన కాలంలో పదునైన ఆయుధంగా మారుతోంది. క్షణాలలో ప్రపంచంలో ఎక్కడ ఏ విషయం అయినా ఇట్టే తెలిసిపోతోంది. దాని వల్ల మేలు ఎంత ఉందో కత్తికి రెండో వైపు అన్నట్లుగా ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఇక సోషల్ మీడియాను వినియోగిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసులలో తమ విధులను సక్రమంగా నెరవేర్చడం లేదు అన్న చర్చ సాగుతోంది. దాంతో పాటుగా నిబద్ధత అంకితభావం, ఏకాగ్రత విధుల విషయంలో తగ్గిపోతున్నాయని అంటున్నారు. ఈ నేపధ్యంలో దేశంలోనే తొలిసారిగా ఒక రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సరికొత్త నిబంధనలను తీసుకుని రాబోతున్నారు.
కఠినమైన మార్గదర్శకాలు :
సోషల్ మీడియా వినియోగం మీద బీహార్ రాష్ట్ర ప్రభుత్వం కఠిమైన నిబంధలను అమలు చేయబోతోంది. ఫేస్ బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రాం, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికల విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధంగా వ్యవహరించాలి అన్న దాని మీద కీలకమైన గైడ్ లైన్స్ ని రూపొందిచింది. వీటిని తాజాగా కేబినెట్ భేటీలో ఆమోదించింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం చూస్తే కనుక ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సోషల్ మీడియా ఖాతా తెరవాలీ అంటే కనుక తమ విభాగాధిపతులకు శాఖాధిపతులకు ముందుగా తెలియ చేయాలి. ఆ మీదట వారి నుంచి తగిన అనుమతి పొందాల్సి ఉంటుంది.
వాటిని వాడరాదు :
అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు తమ వ్యక్తిగత ఖాతాలకు ప్రభుత్వ ఈ మెయిల్ ఐడీలను లేదా ఫోన్ నంబర్లను వాడకూడదు అని నిషేధం విధించింది. అలాగే ఎవరైనా ఫేక్ ఖాతాలను కనుక నిర్వహించినా తెలిసినా చర్యలు కఠినంగా ఉంటాయి. అందువల్ల వాటిని పూర్తిగా నిషేధించారు. ఉద్యోగులు తమ అధికార హోదాను వాడుకుంటూ ప్రభుత్వం రాజ ముద్రను లోగోలను వాడాలని చూసినా లేదా వ్యక్తిగత పోస్టులకు వాటిని వినియోగించినట్లుగా తెలిసినా చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.
ఆ పోస్టులు చేస్తే కనుక :
సామాజిక అశాంతికి దారి తీసేలా సామరస్యత దెబ్బ తీసేలా మతపరమైన కుల పరమైన పోస్టింగులను చేయడం చేస్తే ప్రభుత్వ ఉద్యోగుల మీద సీరియస్ యాక్షన్ ఉంటుందని సదరు గైడ్ లైన్స్ లో పేర్కొన్నారు. అంతే కాదు అశ్లీలానికి సంబంధించిన పోస్టులను ఎవరికైనా షేర్ చేసి పంచుకున్నా కూడా కఠినంగా వ్యవహరిస్తామని బీహార్ ప్రభుత్వం హెచ్చరించింది. అంతే కాదు ప్రభుత్వ ఉద్యోగులు హాజరయ్యే అధికారిక కార్యక్రమాలలో సమావేశాలలో అక్కడ జరిగే కార్యక్రమాల మీద అనుమతి లేకుండా ఫోటోలు తీయడం వీడియోలు తీయడం వాటిని ఆన్ లైన్ లో పోస్టులు చేయడం చేస్తే కనుక కచ్చితంగా యాక్షన్ ఉంటుందని పేర్కొంది. ఇక ఈ కఠినమైన నియమాలు రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే ఉన్నత స్థాయి నుంచి దిగువ స్థాయి వరకూ అందరికీ ఒక్కలాగానే వర్తిస్తాయని బీహార్ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. మొత్తం మీద ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉంటే అంత మేలు అన్న సంకేతాన్ని అయితే నితీష్ కుమార్ సర్కార్ ఇచ్చిన|ట్లుగా చెబుతున్నారు.