ప్రేమ దగ్గరైంది.. అసలేంటి ‘జిప్ కోడ్’ డేటింగ్?
ఒకప్పుడు ప్రేమంటే దేశాలకు.. కాలాలకు అతీతమైన ఒక అనంత ప్రయాణం. సప్త సముద్రాలు దాటిన కథలు, వేల మైళ్ల దూరాన్ని లేఖల ద్వారా తగ్గించుకున్న అనుభవాలు చరిత్రలో కోకొల్లలు.;
ప్రేమంటే రెండు అక్షరాలే కాదు అదో మధురమైన అనుభూతి. ఎంత దూరమైనా తీసుకెళ్లే ఒక మాయాలోకం.. కానీ ఇప్పుడు ప్రేమ చెంతనే ఉండాలనే బలమైన కోరిక యువతలో మొదలైంది.. అదే జిప్ కోడ్ కు కారణమైంది. ఈ కొత్త ట్రెండ్ సౌలభ్యమా? సంకుచితత్వమా? అన్న దానిపై చర్చోపచర్చలు సాగుతున్నాయి..
ఒకప్పుడు ప్రేమంటే దేశాలకు.. కాలాలకు అతీతమైన ఒక అనంత ప్రయాణం. సప్త సముద్రాలు దాటిన కథలు, వేల మైళ్ల దూరాన్ని లేఖల ద్వారా తగ్గించుకున్న అనుభవాలు చరిత్రలో కోకొల్లలు. టెక్నాలజీ రాకతో ఆ దూరం వీడియో కాల్స్‌గా మారి 'లాంగ్ డిస్టెన్స్ రిలేషన్స్'కు ప్రాణం పోసింది. కానీ నేడు పరిస్థితులు మారుతున్నాయి. ప్రేమ ఇప్పుడు మనసుకు చేరువగా ఉండటం కంటే ఇంటికి దగ్గరగా ఉండటమే ముఖ్యమని యువత భావిస్తోంది. అదే ‘జిప్ కోడింగ్’ ట్రెండ్.
గల్లీ దాటని బంధాలు
పిన్ కోడ్ ఎలాగైతే ఒక భౌగోళిక ప్రాంతాన్ని నిర్దేశిస్తుందో నేటి యువత తమ ప్రేమ బంధాలను కూడా కొన్ని కిలోమీటర్ల పరిధిలోనే లాక్ చేసుకుంటున్నారు. డేటింగ్ యాప్స్‌లో ‘నియర్‌బై’ ఆప్షన్లను ఎంచుకుంటూ పక్క వీధిలోనో లేదా గల్లీలోనో తోడును వెతుక్కుంటున్నారు. దీనికి వారు చూపుతున్న కారణాలు చాలా ప్రాక్టికల్‌గా కనిపిస్తున్నాయి. సుదీర్ఘ ప్రయాణాలు, ట్రాఫిక్ కష్టాలు, ప్రయాణ ఖర్చులు వంటివి మెంటల్ స్ట్రెయిన్‌గా మారుతున్నాయని, దగ్గరలో ఉంటే ఎప్పుడంటే అప్పుడు కలవొచ్చనే సౌకర్యాన్ని కోరుకుంటున్నారు.
సౌలభ్యం వర్సెస్ సాన్నిహిత్యం
ఒకే ప్రాంతం కావడం వల్ల భాష, సంప్రదాయాలు ఒకేలా ఉండటం అదనపు బలం అని కొందరి వాదన. అయితే, ఈ సౌలభ్యం వెనుక ఒక ప్రమాదకరమైన సంకుచితత్వం పొంచి ఉంది. కేవలం దగ్గరగా ఉన్నారన్న కారణంతో అసలు మనకు సరిపడే వ్యక్తిని కోల్పోయే అవకాశం ఉంది. మన ఆలోచనలకు సరితూగే వ్యక్తి పక్క ఊర్లోనో.. వేరే నగరంలోనో ఉండవచ్చు. కానీ జిప్ కోడ్ పరిమితి కారణంగా ఆ అవకాశాన్ని మనం ముందుగానే చేజేతులా తుంచేస్తున్నాం. ప్రేమను ఒక 'లోకల్ డెలివరీ' లాగా చూడటం బంధంలోని గాఢతను తగ్గిస్తుందా అనే సందేహం కలగక మానదు.
మనసుకు దగ్గరగా.. మనిషికి చేరువగా!
ప్రేమ అనేది భౌతిక సౌకర్యాల మీద ఆధారపడి పుట్టేది కాదు. కేవలం ట్రాఫిక్ భయంతోనో పెట్రోల్ ఖర్చుల భయంతోనో ప్రేమను పరిధుల్లో బంధించడం అంటే ఆ భావాన్నే అవమానించడం అవుతుంది. నిజమైన బంధం ఎక్కడ ఉన్నా వెతుక్కుంటూ వెళ్తుంది, ఎంత దూరమైనా ఆత్మీయతతో ఆ దూరాన్ని చెరిపేస్తుంది.
జీవనశైలి వేగంగా మారుతున్న మాట నిజమే కానీ బంధాల విషయంలో కేవలం ‘సౌకర్యాన్ని’ మాత్రమే కొలమానంగా తీసుకోవడం ఎంతవరకు సమంజసం? జిప్ కోడ్ కేవలం చిరునామాను మాత్రమే చెప్పగలదు.. మనకు సరిపోయే మనిషిని కాదు. ప్రేమ మన చుట్టుపక్కల దొరకవచ్చు గాక.. కానీ అది మన మనసు లోతుల్లోకి చేరినప్పుడే దానికి సార్థకత.