నా గౌరవానికి భంగం కలిగించారు: ఏసీపీకి కేసీఆర్ లేఖ
ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో తన ఇంటికి నోటీసులు అంటించడంపై మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు.;
ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో తన ఇంటికి నోటీసులు అంటించడంపై మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. ఇది తనను అవమానించడమేనని.. తన గౌరవానికి భంగం కలిగించడమేనని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని నంది నగర్‌లో ఉన్న తన ఇంటికి నోటీసులు అంటించడం అంటే.. తనను అవమానించడం కాకమరేమిటని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన జూబ్లీహిల్స్ అసిస్టెంట్ పోలీసు కమిషనర్‌కు సుదీర్ఘ లేఖ రాశారు. పోలీసులు నోటీసులు అంటించడాన్ని చట్ట విరుద్ధ చర్యగా ఆయన పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఉదంతం.. రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బీఆర్ ఎస్ కీలక నేతలు.. హరీష్‌రావు, కేటీఆర్‌ల ను ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది. వారితో పాటు.. రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్ రావును కూడా పోలీసులు విచా రించారు. ఈ క్రమంలోనే మాజీ సీఎం కేసీఆర్‌కు కూడా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. తొలుత ఇచ్చిన నోటీసులకు.. ఆయన ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌కు రావాలని కోరారు. కానీ, పోలీసులు దానికి అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో మరోసారి నంది నగర్‌లోని ఆయన ఇంటికి వెళ్లి నోటీసులు ఇవ్వాలని అనుకున్నా.. అక్కడ ఎవరూ తీసుకోకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించారు.
ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో విచారణకు రావాలని కేసీఆర్‌ను కోరారు. ఈ పరిణామాలపై శనివారం న్యాయవా దులు.. నిపుణులు, పార్టీ కీలకనాయకులతో చర్చించిన కేసీఆర్.. ఇంటికి నోటీసులు అంటించడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ.. ఏసీపీకి లేఖ రాశారు. ఇది తన పరువుకు భంగమని పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం నోటీసులు అంటించడం అక్రమమని లేఖలో స్పష్టం చేశారు. అదేవిధంగా... పీఆర్ సీ 160 ప్రకారం తనకు నోటీసులు ఇచ్చే పరిధి కూడా ఏసీపీకి లేదన్నారు.
గుర్తు తెలియని వ్యక్తులు..
కాగా.. తన ఇంటికి నోటీసులను అంటించిన వారిని గుర్తు తెలియని వ్యక్తులుగా కేసీఆర్ పేర్కొన్నారు. ఎవరో వచ్చి తన ఇంటికి నోటీసులు అంటించారని తెలిపారు. ఇక, తాను మాజీ సీఎంనని, ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్నానని పేర్కొన్నారు. విచారణకు సహకరిస్తాననిచెప్పిన ఆయన.. ఎర్రవల్లిలోనే ఉంటానని స్పష్టం చేశారు. అక్కడికే రావాలని తెలిపారు. దీంతో ఇప్పుడు సిట్ అధికారులు ఏం చేస్తారన్నది చూడాలి.