అంబటి అరెస్ట్ - హీటెక్కిన గుంటూర్

ఏపీ మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుని శనివారం రాత్రి పొద్దుపోయిన తరువాత గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు.;

Update: 2026-01-31 18:26 GMT

ఏపీ మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుని శనివారం రాత్రి పొద్దుపోయిన తరువాత గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను పోలీసులు నల్లపాడులోని పోలీస్ స్టేషన్ కి తరలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మీద అనుచితమైన వ్యాఖ్యలు చేశారు అన్న ఫిర్యాదు మేరకు అంబటిని అరెస్టు చేశారు. ఈ అరెస్టుకు ముందు అంబటి ఇంటి ముందు తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

మోహరించిన పోలీసులు :

అంబటి అరెస్టుని డిమాండ్ చేస్తూ టీడీపీ క్యాడర్ అంతా అంబటి రాంబాబు ఇంటి ముందు నిరసనలు నిర్వహించారు. మరో వైపు చూస్తే అంబటి ఇంటి మీద ఆయన ఆఫీసు మీద కొంతమంది ఆందోళనకారులు రాళ్ళు రువ్వడంతో పరిస్థితి చేయి దాటిపోకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక వైపు టీడీపీ క్యాడర్ ఆగ్రహం మరో వైపు చూస్తే అంబటి తన నివాసంలోపల ఉండడంతో పోలీసులు ఆయన అరెస్టుని ఏ విధంగా చేయాలన్న దాని మీద మల్లగుల్లాలు పడి చివరికి ఆయన్ను అతి కష్టం మీద బయటకు తీసుకుని వచ్చి పోలీసు వాహనం ఎక్కించారు.

హైకోర్టులో హౌస్ మోషన్ :

మరో వైపు చూస్తే అంబటి రాంబాబు సతీమణి విజయలక్ష్మి హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. అందులో తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. తనతో పాటు తన కుటుంబాన్ని అక్రమంగా పోలీసులు నిర్బంధించారని ఆమె ఆ పిటిషన్ లో ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బ తిందని ఆమె పేర్కొనారు. తాడేపల్లిలో పోలీసులు తనను తనతో ఉన్నవారిని అక్రమంగా అకారణంగా నిర్బంధంలో ఉంచారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలో తమ కుటుంబానికి తగినంత భద్రత కల్పించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని ఆమె ఆరోపించారు.

మేకతోటి హాట్ కామెంట్స్ :

ఇదిలా ఉంటే మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఏపీలో లా అండ్ ఆర్డర్ దెబ్బ తిందని విమర్శించారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని ఆమె డిమాండ్ చేయడం విశేషం. ఎవరిని ఎలా అరెస్టు చేయాలనుకుంటే చేసుకుని పోతున్నారని ఆరోపణలు వస్తే కనీసంగా ప్రాధమిక విచారణ ఉండవద్దా అని ఆమె ప్రశ్నించారు. అంబేద్కర్ రాజ్యాంగం ఏపీలో నడుస్తోందా అని ఆమె నిలదీశారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం లేదని వైసీపీ నేతలను అందరినీ జైళ్ళలో పెట్టాలని చూస్తున్నారని ఆమె విమర్శించారు.

అంబటిని సహించామని :

ఇంకో వైపు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మాధవి నేతృత్వంలో టీడీపీ కార్యకర్తలు అయితే అంబటి మీద నిప్పులు కురిపించారు. అంబటి భాష దారుణంగా ఉందని ఆయన ఈ రకమైన విమర్శలు చేయడంతోనే అరెస్టు చేయాల్సి వస్తోందని అంటున్నారు. అంబటిని సహించామని భరించామని ఇక ఆయన బరితెగింపునకు తగిన ముగింపు చెప్పాల్సిందే అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఫైర్ అయ్యారు. అంబటికి చట్టం పనిచేస్తే ఎలా ఉంటుందో చూపిస్తామని ఆయన అనడం విశేషం.

Tags:    

Similar News