జగన్ కు కోపం వచ్చేలా చేసిన ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు

Update: 2019-09-23 05:38 GMT
అధికార పార్టీ.. అందునా చారిత్రక విజయం సాధించిన తర్వాత అత్యంత జాగరూకతో వ్యవహరించాల్సిన ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు.. ఒకరిపై ఒకరికి ఉన్న రాజకీయ విరోధంతో పార్టీ పరువుతో పాటు ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బ తీసేలా వ్యవహరించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొన్ని విషయాల్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సీరియస్ అవుతారని తెలిసి కూడా.. లైట్ తీసుకున్న వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.

అంతర్గత విభేదాలతో ఏపీ అధికార పార్టీకి చెందినఇద్దరు మహిళా ఎమ్మెల్యేల తీరుపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏ రీతిలో రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవికి.. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనికి మధ్య మంచి సంబంధాలు లేవు. ఇదిలా ఉంటే.. తాజాగా ఒక మసీదు శంకుస్థాపన కోసం మేడికొండూరు మండలంలో చేపట్టిన కార్యక్రమానికి హాజరైన వీరిద్దరూ.. శంకుస్థాపన కార్యక్రమం చేయకుండా తమ దారిన తాము పోవటం షాకింగ్ గా మారింది.

ఒకరు అసహనంతో వెళ్లిపోతే.. మరొకరు అవమాన భారంతో శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టలేదని స్థానికులు చెబుతున్నారు. ఇంతకీ జరిగిందేమంటే.. మసీదు శంకుస్థాపన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ శ్రీదేవిని ఆహ్వానించారు. ఆమెతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే చెందిన చిలకలూరిపేట ఎమ్మెల్యే రజని కూడా హాజరయ్యారు. అయితే.. రజనిని పిలిచిన విషయం శ్రీదేవికి తెలీదంటున్నారు.

ఈ కార్యక్రమానికి తొలుత శ్రీదేవి హాజరయ్యారు. ఆమె వేదిక మీద ఉండగా.. చిలకలూరి పేట ఎమ్మెల్యే రజనీ వస్తున్నట్లుగా నిర్వాహకులు వెల్లడించారు. దీంతో.. శ్రీదేవి ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదిలా ఉంటే.. పెద్ద ఎత్తున అభిమానగణంతో వేదిక మీదకు వచ్చిన రజనీని నిర్వాహకులు కిందకు దిగి మరీ వేదిక మీదకు తీసుకురావటంతో శ్రీదేవి అసహనానికి గురయ్యారు.అదే సమయంలో రజనీ వర్గీయులు ఉత్సాహంతో చేసిన నినాదాలు ఇబ్బందికరంగా మారాయి. దీంతో.. అధికార పార్టీకి చెందిన ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు పక్కపక్కనే కూర్చున్నా మాట్లాడుకోలేదు. పార్టీ నేతలు.. మత పెద్దల ప్రసంగాల అనంతరం ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడతారని నిర్వాహకులు ప్రకటించిన తర్వాత.. తనకు అత్యవసర పని ఉందంటూ వెళ్లిపోయారు.

ఆమె తీరుతో అవాక్కు అయ్యారు నిర్వాహకులు. దీంతో.. అవమానభారానికి గురైన రజనీ తాను వెళ్లిపోనున్నట్లు చెప్పారు. నిర్వాహకులు ఒత్తిడితో ఉండిపోయిన ఆమె.. మొక్కుబడిగా మాట్లాడి మసీదు శంకుస్థాపన చేయకుండానే వెనుదిరిగారు. దీంతో.. నిర్వాహకులే మసీదు శంకుస్థాపనను పూర్తి చేశారు. ఈ వ్యవహారంలో ఎవరిది తప్పు.. మరెవరిది ఒప్పు అన్న విషయాన్ని పక్కన పెడితే..ఒకే పార్టీకి చెందిన నేతల మధ్య ఎంత విభేదాలు ఉన్నా.. బహిరంగంగా ఇలా బయటపడిపోవటం ఏ మాత్రం మంచిది కాదంటున్నారు. ఈ తరహా అంశాలపై పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సీరియస్ అవుతారని తెలిసి కూడా.. నేతలు తమ అసహనాన్ని దాచుకోకుండా బయటపడిపోవటం ఇప్పుడు సంచలనంగా మారింది.
Tags:    

Similar News