నాడు ఏలిన తుమ్మల.. నేడు ఇలా.?

Update: 2019-11-19 14:30 GMT
కారు గుర్తుపై పోటీచేసి ఓడిపోయిన సీనియర్ నేత ఒకరు.. కానీ కారుపార్టీ అధికారంలోకి రావడంతో ఎలాగైనా అధికారం తనదే అనుకున్నారు. 2014లో ఓడిపోయినా తనకు మంత్రి పదవి ఇచ్చిన కేసీఆర్ పై భరోసా ఉంచారు..

ఇక కాంగ్రెస్ గుర్తుపై ఇదే సీనియర్ పై గెలిచిన ఎమ్మెల్యే మరొక్కరు. కాంగ్రెస్ ఎమ్మెల్యే  కారెక్కడంతో ఇక్కడే పితలాటకం మొదలైంది. వలస వచ్చిన ఎమ్మెల్యే గులాబీ గూటికి చేరి అంతా తానై వ్యవహరిస్తున్నారు. కారులో సీనియర్ నే పక్కనపెట్టేశాడు. ఈ ఆసక్తికర పరిణామం ఖమ్మం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

ఖమ్మం జిల్లాలో ఇప్పుడు కందాల వర్సెస్ తుమ్మల ఎపిసోడ్ సెగలు కక్కుతోందట. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాడేరులో  తుమ్మల నాగేశ్వరరావు పోటీచేసి ఓడిపోయారు. ఆయనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గెలిచారు. ఓడిన నేతలకు మంత్రి పదవులు ఇవ్వమని కేసీఆర్ తీర్మానించడంతో తుమ్మలకు ఈసారి మంత్రి పదవి దక్కకుండా పోయింది. పోయిన సారి మంత్రి అయిన తుమ్మల ఈసారి ఎలాగూ ఏదైనా నామినేటెడ్ వస్తుందని ఎదురుచూస్తున్నా కేసీఆర్ కరుణించడం లేదు..

అయితే ఇప్పుడు తుమ్మల, ఉపేందర్ రెడ్డి ఇద్దరు టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. సీనియర్ ఒకరు.. వలసవచ్చి గులాబీ గూటికి చేరిన ఎమ్మెల్యే ఒకరు.  అయితే ఇప్పుడు పాడేరు నియోజకవర్గంలో తుమ్మలను  సిట్టింగ్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి పూర్తిగా పక్కనపెట్టేశారట.. మొన్నటి పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో తుమ్మల వర్గానికి టీఆర్ఎస్ టికెట్లే ఇవ్వలేదట.. దీనిపై తుమ్మల అధిష్టానానికి ఫిర్యాదు చేయగా ఇద్దరికీ సంధి కుదిర్చారట.. ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు.

అయితే కందుల ఇటీవల పార్టీ సభ్యత్వ నమోదులోనూ తుమ్మల వర్గాన్ని పక్కనపెట్టడంతో వివాదం ముదిరింది. పార్టీలో తుమ్మల వర్గానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో వారంతా సమావేశమయ్యారట.. ఇక ప్రభుత్వ పనులు, కాంట్రాక్టులు, అధికారులతో పని విషయంలో పాడేరు నియోజకవర్గంలో ఇప్పుడు తుమ్మల పప్పులు ఉడకడం లేదట.. అంతా ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి హవానే సాగుతోందట.. టీఆర్ఎస్ అధిష్టానానికి తెలిసినా తుమ్మల విషయంలో మౌనంగా ఉండడం ఆయనలో, ఆయన వర్గంలో అసహనాన్ని పెంచుతోందట.. దీంతో తుమ్మల తన రాజకీయ భవిష్యత్ కోసం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది జిల్లా వర్గాల్లో ఆసక్తి రేపుతోందట..


Tags:    

Similar News