టీటీడీ గొప్ప నిర్ణయం.. ఇన్నేళ్లకు భక్తుల కష్టాలు తీర్చే స్టెప్

Update: 2022-09-24 12:54 GMT
తిరుమల.. కలియుగ ప్రత్యక్ష దైవం కొలువుంటే ఈ భక్తి ప్రదేశాన్ని చేరుకోవడానికి ప్రతి హిందువు తహతహలాడుతుంటాడు. ఆయా వ్యక్తులు, సెలబ్రెటీలు సైతం తిరుమల దర్శనం కోసం ఎగబడుతుంటారు. పలుకుబడిని బట్టి వీఐపీ దర్శనాలు చేసుకుంటారు. అయితే సామాన్య భక్తులకు మాత్రం ఆ దేవుడు బహుదూరపు బాటసారిగానే కనిపిస్తాడు.

ఈ నేపథ్యంలోనే తిరుమలలో సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఎవరూ తీసుకోని సంచలన నిర్ణయాలు తీసుకొని భక్తులకు ఊరటనిచ్చింది. ఇన్నాళ్లు సామాన్య భక్తులకు ఉదయం దర్శనం చేసుకోవడం దుర్లభంగా ఉండేది. అదంతా వీఐపీలకే పోయేది. అయితే తాజాగా టీటీడీ పాలకమండలి సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంది. గత 20 ఏళ్లుగా ఎవరూ టచ్ చేయని అంశంపై వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని పాలకమండలి సంచలన నిర్ణయం తీసుకొని భక్తులకు గొప్ప ఊరట కల్పించింది.

వీఐపీల దర్శన సమయాన్ని ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య ఉండేలా పాలక మండలి సమావేశంలో తీర్మానించారు.  ఇప్పటివరకూ వీఐపీ ప్రోటోకాల్, వీఐపీ దర్శనాలు, ప్రొటోకాల్, ఆర్జిత సేవలను ఉదయాన్నే కొనసాగించేవారు. వీటి తర్వాతే సామాన్య భక్తులకు సర్వదర్శనం ఉండేది. కానీ ఇప్పుడు టీటీడీ పాలక మండలి తాజా నిర్ణయంతో ఉదయాన్నే సామాన్య భక్తులకు కలియుగ దైవం దర్శనభాగ్యం కల్పించనున్నారు.

-ఇక భక్తుల వసతి ఈజీ

ఇన్నాళ్లు తిరుమలకు వచ్చే భక్తులకు కొండపైన రూం దొరకడం పెద్ద గగనమయ్యేది. తిరుమలకు వచ్చాక రోడ్లపైన, గుడారాలు, రేకుల కిందనే ఉండేవారు. ఇక మీదట భక్తులకు తిరుపతిలోనే గదులు కేటాయించాలని ఇవాల్టి పాలక మండలి సమావేశంలో తీర్మానించారు. తిరుమలలో లేదా.. తిరుపతిలో ఎక్కడ ఖాళీ ఉంటే వారికి అక్కడే వసతి కల్పిస్తారు. దీనివల్ల తిరుపతి వెళ్లాక వారికి వసతి సమస్యలు ఉండవు.

ఈ నిర్ణయం వల్ల ఏ భక్తుడు కొండపైన ఇక షెడ్లలో ఉండాల్సిన బాధ ఉండదు. దర్శనం కూడా తిరుపతిలోనే బుక్ చేసుకుంటే ఆ సమయానికే కొండపైకి వెళ్లొచ్చు. తిరుమలకు వెళ్లిన తర్వాత గదులు దొరక్క నానా ఇబ్బందుల పడే బాధ తప్పనుంది. తిరుమలలో రూం దొరక్కపోతే తిరుపతిలోనే గది చూసుకొని దర్శనానికి తిరుమలకు వెళతారు భక్తులు. దీనికోసం సీఆర్వో ఆఫీసును తిరుపతికి మార్చాలని నిర్ణయించారు. బ్రహ్మోత్సవాల తర్వాత ఇక సీఆర్వో ఆఫీసుతోపాటు రూంల కేటాయింపు తిరుపతి నుంచే ఉండనుంది.

ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అనంతరం ఇక తిరుపతి నుంచే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. తద్వారా తిరుమల కొండపై భక్తుల ఎదురుచూపులకు కళ్లెం పడనుంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News