జగన్ కి షాక్ ఇచ్చేస్తున్న పొరుగిల్లు...?

Update: 2022-02-17 10:30 GMT
ఏపీ సీఎం జగన్ సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతున్నారు. ఆయన ముఖ్యమంత్రి కాగానే కొన్నాళ్ళు కేసీయార్ తో మంచి దోస్తీ చేశారు. ఏకంగా విందులూ సాగాయి. ఇద్దరూ కలసి శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆద్వర్యాన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాలుపంచుకున్నారు. దాంతో రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్కటిగా ఉంటాయని, విడిపోయినా కలసి నడుస్తాయని అంతా భావించారు.

అయితే ఇద్దరు సీఎం లు కలయిక మీద కేంద్రంలోని బీజేపీకి కంటగింపుగా మారింది అని కూడా అప్పట్లో ప్రచారం సాగింది. అదే టైమ్ లో కేంద్రం జగన్ తో మంచి రిలేషన్స్ కొనసాగించింది.

జగన్ సైతం ఏపీ ప్రయోజనాల పేరిట కేంద్రంతో సానుకూలంగా  ఉంటూ వచ్చారు. ఈ నేపధ్యంలో కేసీయార్ బీజేపీతో తాడో పేడో అన్నట్లుగా వ్యవహరించడంతో పూర్తిగా కాషాయదళానికి కన్నెర్రగా మారారు.

ఇంత జరుగుతున్నా ఏపీ సీఎం జగన్ కేసీయార్ యాంటీ మోడీ విధానాలకు మద్దతు పలకకపోవడమే ఇక్కడ చిత్రం. ఆ మధ్యన కూడా విద్యుత్ సంస్కరణల విషయంలో కేంద్రాన్ని కేసీయార్ గట్టిగా నిలదీశారు. కానీ ఏపీలో మాత్రం మోటార్లకు విద్యుత్ మీటర్లను బిగించడానికి ఓకే చెప్పడం పొరుగు సీఎం కి అంతగా రుచించలేదు అంటారు.

ఆ బాధను ఆయన ఈ మధ్య జరిగిన మీడియా సమావేశంలో వ్యక్తం చేశారు అని అంటారు. ఏపీలో విద్యుత్ సంస్కరణలను అమలు చేస్తున్నారని, శ్రీకాకుళంలో పెద్దన రైతుల మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారని కేసీయార్ మీడియా మిత్రులతో చెప్పడం జరిగింది. తాము మాత్రం కేంద్రం వత్తిడికి తలొగ్గలేదని ఆయన చాలా గట్టిగానే చెప్పుకున్నారు.

ఒక విధంగా జగన్ సర్కార్ మీదకు రైతులకు కేసీయార్  ఎగదోశారనే అంటున్నారు. ఇపుడు టీయారెస్ మంత్రి హరీష్ రావు కూడా అచ్చం ఇలాగే మాట్లాడారు.

 ఏపీలో విద్యుత్ సంస్కరణలు అమలవుతున్నాయని తాము అలాంటి పని పొరపాటున కూడా చేయమని చెబుతున్నారు. చూడబోతే ఏపీలో జగన్ సర్కార్ ని బదనాం చేయడానికి మెల్లగా టీయారెస్ తన వంతు ప్రయత్నాలు చేస్తోందా అన్న అనుమానాలు అయితే వస్తున్నారు.

గత రెండేళ్ళుగా సీఎం ల మధ్య పెద్దగా మాటా మంతీ అయితే లేదు. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. కేసీయార్ కేంద్రానికి వ్యతిరేకంగా ముందుకు సాగుతున్నాయి. ఆయనకు ఇతర రాష్ట్రాల సీఎంల నుంచి మద్దతు దక్కుతోంది. సాటి తెలుగు రాష్ట్రం నుంచి అయితే ఏమీ సానుకూల సంకేతాలు లేవు. ఈ నేపధ్యంలో కూడా టీయారెస్ శిబిరం గరం గరం గా ఉంది అంటున్నారు.

ఏపీలో జగన్ సీఎం కావాలని 2014 నుంచి టీయారెస్ గట్టిగా కోరుకుంది. ఆ కోరిక 2019లో తీరింది. జగన్ సీఎం కావడానికి టీయారెస్ చాలా సాయం చేసింది అని కూడా ప్రచారంలో ఉంది. మరో వైపు జగన్ రాజకీయంగా తనకంటే జూనియర్ కాబట్టి తన మాట వింటారు అన్న ఆలోచన కూడా కేసీయార్ కి ఉండి ఉండాలి. కానీ జగన్ మూడేళ్ల పాలనలోనే రాటుదేలిపోయారు.

తనకంటూ సొంత నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు. జాతీయ స్థాయిలో కూడా ఆయన అంచనాలు ఆయనకు ఉన్నాయని చెబుతారు. మొత్తానికి ఈ రోజుకి కూడా బీజేపీతో సన్నిహితంగా జగన్ ఉంటున్నారు అని ప్రచారం ఉంది.

ఇదే టీయారెస్ కి కాక పుట్టిస్తోందని, అందుకే జగన్ని కోరి మరీ కెలుకుతున్నారని అంటున్నారు. చూడాలి మరి టీయారెస్ రాజకీయ దూకుడు జగన్ వైపు మళ్ళితే ఎలాంటి పరిణామాలు సంభవిస్తారో చూడాల్సిందే.
Tags:    

Similar News