మీటింగ్‌కు వ‌స్తేనే పింఛ‌న్ కార్డులు ఇవ్వాలి: ఆ ఎమ్మెల్యే హుకుం!

Update: 2022-09-04 13:30 GMT
తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకా కొన్ని నెల‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. దీంతో అన్ని పార్టీల అభ్య‌ర్థుల్లో ఎన్నిక‌ల హీట్ పెరుగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా శ్ర‌మిస్తున్నారు. ఇందుకు ఏ అవ‌కాశ‌మొచ్చినా విడిచిపెట్ట‌డం లేదు. ఇక అధికార పార్టీ ఎమ్మెల్యేల‌యితే ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను అడ్డం పెట్టుకుని ప్ర‌జ‌ల‌ను బెదిరించ‌డం, త‌మ స‌మావేశాల‌కు రాక‌పోతే ప‌థ‌కాలు అంద‌కుండా చేస్తామ‌ని హెచ్చ‌రించ‌డం చేస్తున్నార‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

తాజాగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గ్యాద‌రి కిశోర్ కూడా ఇలాగే ప్ర‌వ‌ర్తించార‌ని వార్త‌లు వ‌చ్చాయి. తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త ఆస‌రా పింఛ‌న్ల కార్డుల‌ను త‌న స‌మావేశానికి వ‌చ్చిన వారికి మాత్ర‌మే ఇవ్వాల‌ని గ్యాద‌రి కిశోర్ అధికారుల‌ను ఆదేశించడం వివాదాస్ప‌ద‌మ‌వుతోంది.

త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో ఎమ్మెల్యే గ్యాద‌రి కిశోర్ ప‌ర్య‌టించారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న అభివృద్ధి పనులకు శంకుస్థాప‌న‌లు చేశారు. అలాగే మ‌రికొన్నిటికి శిలాఫ‌ల‌కాలు ఆవిష్క‌రించారు. ఆ త‌ర్వాత కొత్త పింఛ‌న్ కార్డుల‌ను ల‌బ్ధిదారుల‌కు మంజూరు చేసేందుకు ఉద్దేశించి ఏర్పాటు స‌మావేశంలో ఎమ్మెల్యే గ్యాద‌రి కిశోర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

గ్రామానికి కొత్తగా 152 ఆసరా పింఛన్లు మంజూరైతే మీటింగ్‌కు లబ్ధిదారులందరూ రాలేదని ఎమ్మెల్యే గ్యాద‌రి కిశోర్ పంచాయ‌తీ కార్య‌ద‌ర్శిపై మండిప‌డ్డార‌ని స‌మాచారం. స‌మావేశం రాని లబ్ధిదారులకు కొత్త పింఛన్‌ కార్డులను ఇవ్వవద్దని పంచాయతీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. తాను చెప్పాక కూడా ల‌బ్ధిదారుల‌కు కార్డులు పంపిణీ చేస్తే 'నీ లాగు పగులుద్ది' అంటూ పంచాయ‌తీ కార్య‌ద‌ర్శిపై అందరి ముందు తీవ్ర వ్యాఖ్య‌లు చేశార‌ని అంటున్నారు. ప్ర‌భుత్వం ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టి అమలుచేస్తుంటే.. లబ్ధిదారులు సమావేశాలకు హాజరుకాకపోతే ఎలా అంటూ ఎమ్మెల్యే తీవ్ర అసహనం వ్యక్తం చేశార‌ని చెబుతున్నారు. ఈ సందర్భంగానే స్థానిక పంచాయతీ కార్యదర్శి వెంకన్నపై పరుష పదజాలంతో ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశార‌ని అంటున్నారు. దీనిపై ఉద్యోగ సంఘాల నేత‌లు మండిప‌డుతున్నారు.

కాగా తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఉస్మానియా యూనివ‌ర్సిటీ జేఏసీ నేత‌గా ఉన్నారు.. గ్యాద‌రి కిశోర్. జ‌ర్న‌లిజంలో పీహెచ్‌డీ చేసిన ఆయ‌న 2014లో తుంగ‌తుర్తి నుంచి టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా పోటీ చేసి కేవ‌లం 2300 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్య‌ర్థి అద్దంకి దయాక‌ర్ పైన గెలుపొందారు. 2018లోనూ కేవ‌లం 1800 ఓట్ల తేడాతో అద్దంకి దయాక‌ర్‌పైనే గెలిచారు.
Tags:    

Similar News