మెస్సీ టూర్ లో 'వింతా'ర‌..భార‌త్ లో అద‌నంగా ఒక‌రోజు!

రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత, అప‌ర కుబేరుడు ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ... మూగ‌జీవాల మీద అమిత‌మైన‌ ప్రేమ‌తో అత్యంత భారీగా ఏర్పాటు చేసిన‌దే వంతారా.;

Update: 2025-12-17 11:02 GMT

ఫుట్ బాల్ దిగ్గ‌జం ల‌యోన‌ల్ మెస్సీ ఎక్క‌డున్నాడు? అదేంటి..? గోట్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా గ‌త శ‌నివారం కోల్ క‌తాలో అడుగుపెట్టిన అర్జెంటీనా స్టార్ అదే రోజు హైద‌రాబాద్ వ‌చ్చాడు. ఆ రాత్రి భాగ్య‌న‌గ‌రంలోనే బ‌స చేసి ఆదివారం ముంబై వెళ్లాడు. క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ తో క‌లిసి ముంబై వాంఖ‌డేలో మెరిశాడు. సోమ‌వారం ఢిల్లీలో క‌నిపించాడు. ప్ర‌ధాని మోదీతో భేటీ కావాల్సిన‌ప్ప‌టికీ.. వాతావ‌ర‌ణం అనుకూలించ‌క మెస్సీ ఢిల్లీ చేర‌డం ఆల‌స్యం అయింది. దీంతో మోదీతో స‌మావేశం వీలుకాలేదు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో కార్య‌క్ర‌మం అనంత‌రం మెస్సీ వెళ్లిపోయిన‌ట్లుగా అంద‌రూ భావించారు. మీడియా కూడా అదే రాసేసింది. భార‌తీయుల‌ను మురిపించి వెళ్లాడంటూ చెప్పుకొచ్చింది. మంగ‌ళ‌వారం ప‌త్రిక‌ల్లో ఇదే విష‌యం ప్ర‌చురిత‌మైంది. తీరా చూస్తే, మెస్సీ మంగ‌ళ‌వారం రాత్రి గుజ‌రాత్ జామ్ న‌గ‌ర్ లోని రిల‌య‌న్స్ సంస్థ‌కు చెందిన భారీ జంతు సంర‌క్ష‌ణ కేంద్రం వంతారాలో మెరిశాడు. అత‌డితో పాటు భార‌త ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన సువారెజ్, రోడ్రిగో కూడా ఉన్నారు. అంటే, మెస్సీ టీమ్ మంగ‌ళ‌వారం కూడా మ‌న దేశంలోనే ఉన్న‌ట్లు అన్న‌మాట‌.

 

షెడ్యూల్ లో ఉందా? లేదా?

 

మెస్సీ భార‌త ప‌ర్య‌ట‌న షెడ్యూల్ ప్ర‌కారం.. కోల్ క‌తా-హైద‌రాబాద్-ముంబై-ఢిల్లీ.. ఇలా దేశం న‌లుమూల‌ల ఉన్న‌ నాలుగు ప్ర‌ధాన న‌గ‌రాల‌ను చుట్టివ‌స్తుంద‌ని చెప్పుకొచ్చారు. ఈ మేర‌కే మొత్తం ప‌ర్య‌ట‌న సాగింది. కానీ, చివ‌ర‌లో ఢిల్లీ త‌ర్వాత వంతారాలోనూ ప‌ర్య‌టిస్తార‌ని మాత్రం ఎవ‌రూ ఊహించ‌లేదు. ఢిల్లీ నుంచి స్వ‌దేశం అర్జెంటీనా కానీ, ఇత‌ర నిర్దేశిత ప్ర‌దేశానికి కాని మెస్సీ వెళ్లిపోతాడ‌ని అనుకుంటే రిల‌య‌న్స్ వంతారాలో త‌ళుక్కుమ‌న్నారు.

 

వంతారాలో విశేషాల‌ను తెలుసుకుని..

 

రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత, అప‌ర కుబేరుడు ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ... మూగ‌జీవాల మీద అమిత‌మైన‌ ప్రేమ‌తో అత్యంత భారీగా ఏర్పాటు చేసిన‌దే వంతారా. బ‌హుశా అనంత్ త‌ప్ప మ‌రే మ‌నిషికి సాధ్యం కాద‌న్నంత అద్భుతంగా వంతారా ఉంటుంది. దీనిని చూసిన‌వారే కాదు.. తెలిసిన‌వారూ గొప్ప‌గా చెప్పుకొంటున్నారు. అలాంటి వంతారాను మంగ‌ళ‌వారం రాత్రి టైట్ సెక్యూరిటీ మ‌ధ్య వెళ్లాడు మెస్సీ. అక్క‌డి జంతువుల‌తో గ‌డిపాడు. ఆల‌యాల్లో పూజ‌లు చేశాడు.

 

అత్యంత విలువైన కానుక‌...

ఇక త‌న క‌ల‌ల ప్ర‌పంచం వంతారాకు వ‌చ్చిన మెస్సీకి అనంత్ అంబానీ 1.2 మిలియ‌న్ డాల‌ర్ల విలువైన రిచ‌ర్డ్ మిల్లె వాచ్ ను బ‌హుమ‌తిగా ఇచ్చారు. వ‌చ్చిన‌ప్పుడు మెస్సీ బోసి చేతితో క‌నిపించాడు. వెళ్లేట‌ప్పుడు అత్యంత ఖ‌రీదైన మిల్లె వాచ్ తో ధ‌రించి ఉన్నాడు. ఇక అనంత్... స్వయంగా త‌యారుచేయించుకున్న అత్యంత ప్రత్యేకమైన రిచర్డ్ మిల్లె గడియారాలలో ఒకటైన పీస్ యూనిక్ ఆర్ఎం056 సఫైర్ టూర్‌బిల్లాన్ ను ధరించారు. దీని ధర 12 ల‌క్ష‌ల డాల‌ర్లు (దాదాపు రూ.10 కోట్లు).



Tags:    

Similar News