పౌరసత్వ నిబంధనల్లో కీలక మార్పులు చేసిన కెనడా
ఇన్నాళ్లు అమెరికానే అనుకున్నాం ఇప్పుడు కెనడా కూడా మొదలుపెట్టింది. కెనడాకు వెళ్లడానికి కూడా నిబంధనలు పెట్టింది. అయితే ఇది భారతీయులకు ఊరట లభించేలా ఉండడం విశేషం.;
ఇన్నాళ్లు అమెరికానే అనుకున్నాం ఇప్పుడు కెనడా కూడా మొదలుపెట్టింది. కెనడాకు వెళ్లడానికి కూడా నిబంధనలు పెట్టింది. అయితే ఇది భారతీయులకు ఊరట లభించేలా ఉండడం విశేషం. కెనడా ప్రభుత్వం పౌరసత్వ చట్టంలో కీలక మార్పులను తీసుకొచ్చింది. ఈ మార్పుల ద్వారా కెనడా వెలుపల జన్మించిన కెనడియన్ పౌరుల పిల్లలకు పౌరసత్వం కల్పించే అవకాశాన్ని విస్తరించింది. అయితే ఇందుకు కొన్ని స్పష్టమైన అర్హతలు కూడా విధించింది. ఈ కొత్త నిబంధనలు సోమవారం నుంచి అమలులోకి వచ్చాయి.
తాజా మార్పుల ప్రకారం.. డిసెంబర్ 15 , 2025కు ముందు జన్మించినవారు లేదా పాత నిబంధనల కారణంగా ఇప్పటివరకూ పౌరసత్వం పొందలేని వారు ఇకపై కెనడియన్లుగా గుర్తింపునకు అర్హులు అవుతారు. వీరు పౌరసత్వ రుజువు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఇమిగ్రేషన్, రిప్యూజీ అండ్ సిటిజెన్ షిప్ కెనడా (ఐఆర్సీసీ) స్పష్టం చేసింది. అయితే డిసెంబర్ 15 , 2025 తర్వాత జన్మించే పిల్లల విషయంలో కొత్త నిబంధన వర్తిస్తుంది. అలాంటి పిల్లల తల్లిదండ్రులు కెనడాలో కనీసం మూడు సంవత్సరాలు నివసించినట్లు రుజువు చేయాల్సి ఉంటుంది. ఈ అర్హతను నెరవేర్చినట్లయితేనే కెనడా వెలుపల జన్మించిన పిల్లలకు పౌరసత్వం లభిస్తుంది.
ఈ సంస్కరణలతో అనేక మంది భారతీయులకు గణనీయమైన ప్రయోజనం చేకూరనుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు, చదువు లేదా ఇతర కారణాల వల్ల కెనడా బయట నివసిస్తున్న కెనడియన్ పౌరుల కుటుంబాలకు ఇది పెద్ద ఊరటగా మారనుంది.
వాస్తవానికి 2009 నుంచి ఇటీవలి వరకూ కెనడాలో ‘ఫస్ట్ జనరేషన్ లిమిట్’ అనే నిబంధన అమల్లో ఉండేది. ఆ నిబంధన ప్రకారం.. కెనడా వెలుపల జన్మించిన లేదా దత్తత తీసుకున్న పిల్లల తల్లిదండ్రుల్లో కనీసం ఒకరు కెనడాలోనే పుట్టి ఉండాలి లేదా కెనడాలోనే పౌరసత్వం పొందాలి. ఈ కఠిన నిబంధన వల్ల ఎంతో మంది తమ సహజ హక్కు అయిన పౌరసత్వాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో 2023లో ఆంటారియో కోర్టు ఈ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని తీర్పు చెప్పింది. కోర్టు తీర్పును కెనడా ప్రభుత్వం కూడా అంగీకరించింది. అప్పీల్ కు వెళ్లకుండా బిల్ సీ3 పేరుతో పౌరసత్వ చట్టంలో మార్పులు చేసింది. ఫలితంగా ఇప్పుడున్న ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.
మొత్తంగా చూస్తే కెనడా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సంస్కరణలు పౌరసత్వ వ్యవస్థను మరింత న్యాయసమ్మితంగా మార్చడమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కెనడియన్ కుటుంబాలకు భరోసానిచ్చే నిర్ణయంగా నిలుస్తాయి.