హైదరాబాద్ లో దారుణం... స్కూల్ ఐడీ కార్డుతో 9ఏళ్ల బాలుడు ఉరి!
అవును... స్కూల్ యూనిఫాం సరిగ్గా ధరించలేదని అదేపనిగా తోటి విద్యార్థులు ఆరోపిస్తూ ఇబ్బంది పెట్టడంతో తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు!;
పలు చోట్ల స్కూలు దశలోనే బాలురు తుపాకీలతో కాల్చడం, కత్తులతో పొడవడం వంటి చర్యలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల దేశ, విదేశాల్లో చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే! మరో వైపు ప్రైమరీ స్కూల్ దశలోనే ర్యాగింగ్ లు, మానసిక ఒత్తిళ్లు ఎదురవుతుండటంతో ఆత్మహత్యలు చేసుకుంటూ మొగ్గ దశలోనే భవిష్యత్ భారత పౌరులు రాలిపోతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
అవును... స్కూల్ యూనిఫాం సరిగ్గా ధరించలేదని అదేపనిగా తోటి విద్యార్థులు ఆరోపిస్తూ ఇబ్బంది పెట్టడంతో తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు! నాలుగో తరగతి చదువుతున్న ఆ బాలుడు హైదరాబాద్ లోని తన ఇంట్లోని వాష్ రూమ్ లో స్కూల్ ఐడీ కార్డు లాన్యార్డ్ తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు! ఈ సమయంలో బాలుడి తల్లితండ్రుల వాంగ్మూలాలను సమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వివరాళ్లోకి వెళ్తే... హైదరాబాద్ లోని చందానగర్ ప్రాంతానికి చెందిన బాలుడు.. తన స్కూల్ యూనిఫామ్ విషయంలో తోటి విద్యార్థులు పదే పదే ఆటపట్టించడంతో మనస్తాపానికి గురయ్యాడని చెబుతున్నారు. ఈ క్రమంలో.. మంగళవారం సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన అనంతరం.. వాష్ రూమ్ లోకి వెళ్లి, తన స్కూల్ ఐడీ కార్డ్ లాన్యార్డ్ ఉపయోగించి ఉరి వేసుకున్నట్లు తెలుస్తోంది!
దీంతో కుటుంబ సభ్యులు అతన్ని హుటాహుటున సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు! ఈ నేపథ్యంలో.. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు! చట్టపరమైన లాంఛనాల అనంతరం.. బాలుడి మృతదేహాన్ని అతని స్వగ్రామానికి తరలించారు.
ఇలా 9 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకుని మరణించడం.. విద్యాసంస్థల్లో బెదిరింపుల ప్రాబల్యం గురించి ఆందోళనలను రేకెత్తించింది. ఈ సందర్భంగా స్పందించిన పోలీసులు.. స్కూల్స్, కాలేజీలలో వేధింపులను ఎదుర్కోవడానికి కఠినమైన చట్టపరమైన నిబంధనలు ఉన్నాయని చెబుతున్నారు! భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా స్కూల్స్ లో మరింత బలమైన మానసిక ఆరోగ్య సహాయ వ్యవస్థలు అవసరమని పిల్లల హక్కుల కార్యకర్తలు, తల్లితండ్రులు పిలుపునిస్తున్నారు.