కనుమరుగవుతున్న అన్నదాత.. భూమితో తీరిపోతున్న రుణం.. నేడు జాతీయ రైతు దినోత్సవం

Update: 2020-12-23 05:56 GMT
‘అన్నదాతా.. సుఖీభవ’ కాలే కడుపుకు నాలుగు మెతుకులు పెట్టిన వారిని.. చల్లగా జీవించమని అలా దీవిస్తుంటారు తిన్నవారు. కానీ.. ఓ రచయిత చెప్పినట్టు ‘అన్నదాత అంటే వడ్డించిన వారు కాదు. పండించిన వాడు.’ వడ్డించే వాడి సౌఖ్యాన్ని కోరుకునే మనం.. ఆ తిండిని పండించిన వాడి గురించి ఇంకెంత కోరుకోవాలి? కానీ.. ఈ దేశంలో అన్నదాత సుఖంగా లేడు.. సంతోషంగా అసలే లేడు. కష్టాల సాళ్లలో సాగిలబడుతూ.. కన్నీళ్లతో పైర్లు తడుపుతూ.. ఈ దేశానికీ, ప్రపంచానికీ తిండి పెడుతున్న రైతన్న, తాను మాత్రం కడుపు మాడ్చుకుంటున్నాడు. ఆ ఆకలి బాధ మరింతగా దహించి వేసినప్పుడు పురుగుల మందును పెరుగన్నంలా తినేస్తున్నాడు. ఉరికొయ్యలకు వేళ్లాడుతూ తనువు చాలిస్తున్నాడు. ఈ పరిస్థితి కారణం ఎవరు?

సాగు జూదమే..

అయితే.. అతివృష్టి, లేదంటే.. అనావృష్టి. ప్రకృతి ఆడుతున్న చెలగాటాన్ని ఎదుర్కొంటూ సేద్యం చేస్తున్న రైతన్న ఎదుర్కొంటున్న తొలిగండం నకిలీ విత్తనాలు. విత్తు ఒకటి నాటితే.. చెట్టు మరొకటి మొలకెత్తే ఈ విత్తనాలు రైతును తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఆ తర్వాత పురుగు మందులు.. చెట్టంత అన్నదాత తింటే సరిగ్గా పనిచేసే ఎరువులు, పురుగు మందులు.. చీడపీడలపై మాత్రం సరిగా పనిచేయవు. ఈ బాలారిష్టాలను అధిగమించి పంట చేతికి అందేలోపు తనగండం మరోసారి దాటాలంటూ ప్రకృతి దాడిచేస్తుంది. వైకుంఠ పాళిలో ఆటమాదిరిగా ఎన్నో గండాలు దాటుకొని పంటను మార్కెట్ కు తరలిస్తే.. ఆ చివరి ఘడియలో అమాంతం మింగేస్తోంది కార్పొరేట్ వ్యాపార మాయాజాలం. ప్రాణాలు పణంగా పెట్టి రాత్రి, పగలు తేడా లేకుండా.. ఎండా వానకు వెరవకుండా సాగుచేసి పంటను అమ్మకానికి తెస్తే.. దానికి ధరను వ్యాపారి నిర్ణయిస్తాడు. రైతు కష్టాలు, కన్నీళ్లు తెలియని వాడికి అన్నదాత చెమట విలువ ఏం తెలుస్తుంది? వాడు చెప్పిన ధరకే పంటను తెగనమ్ముకొని, వచ్చిన కాడికి పట్టుకొని ఇంటికి బయల్దేరుతాడు భారత బక్కరైతు. దేశానికి తిండి పెట్టే అభాగ్యపు అన్నదాత.

బోనులు నిలబడాల్సింది ప్రభుత్వాలే..

ఈ దారుణ అన్యాయాన్ని కూడా దిగమింగుతూ కష్టాల సేద్యం చేస్తున్న రైతన్నలు.. ఇప్పుడు తమ ఉనికికే ప్రమాదం వచ్చిందని దేశ రాజధాని సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నారు. మార్కెట్లోనే తమను నిలువునా దోచుకున్న వ్యాపారులు.. ఇప్పుడు కార్పొరేట్ రూపంలో వచ్చి, తమను భూమికి దూరం చేసేందుకు చూస్తున్నారని, వణికిస్తున్న చలిలో నెల రోజులుగా ఆందోళన చేస్తున్నారు. 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో అన్నదాత పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదు. ఈ దుస్థితికి సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వాలు మాత్రమే.

నేడు రైతు దినోత్సవం..

ఈ రోజు జాతీయ రైతు దినోత్సవం అన్న సంగతి ఎంత మందికి తెలుసు? అని అడిగితే.. నూటికి 90 మంది తమకు తెలియదనే చెప్తారంటే అతిశయోక్తి కాదు. రాజకీయ నేతల జయంతులు, వర్ధంతులు నిర్వహించే ప్రభుత్వాలు.. దేశానికి అన్నం పెట్టే రైతు దినోత్సవాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. భారత మాజీ ప్రధాని చరణ్‌సింగ్‌ జన్మదినమైన ఈ రోజును (డిసెంబరు 23) రైతు దినోత్సవం జరుపుకుంటారు.

ఆయన ఉద్యమాల ఫలితం..

భారత ఐదో ప్రధానిగా పనిచేసిన చరణ్ సింగ్ ఆధ్వర్యంలో కొనసాగిన పలు ఉద్యమాల ఫలితంగానే జమీందారీ చట్టం రద్దయి కౌలుదారీ చట్టం అమలులోకి వచ్చింది. రైతులకు బ్యాంకు రుణాలు అందించే విధానం కూడా ఈయన ఉద్యమాల ఫలితంగానే ప్రవేశపెట్టారు. నిరంతరం.. రైతుల గురించి, వ్యవసాయ రంగం గురించి ఆలోచించి, వారి సమస్యల పరిష్కారానికి చరణ్ సింగ్ కృషి చేశారు. ఫలితంగా.. చరణ్ సింగ్ ‘రైతు బంధు’గా గుర్తింపు తెచ్చుకున్నారు. స్వార్థ రాజకీయాలను ఎదుర్కొలేక‌పోయిన చరణ్ సింగ్.. తాత్కాలిక ప్ర‌ధానిగా 1980లోనే ఆయన ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. 1987 మే 29న ఆయన కన్నుమూశారు. రైతు కుటుంబం నుంచి వ‌చ్చిన చ‌ర‌ణ్ సింగ్‌ .. రైతుల‌కు చేసిన సేవ‌ల‌కు గుర్తుగా ఆయ‌న జ‌న్మ‌దినం డిసెంబ‌ర్ 23న జాతీయ రైతు దినోత్స‌వం (కిసాన్ దివ‌స్)గా జ‌రుపుకొంటారు.


ప్రభుత్వాల కనీస బాధ్యత..

రైతే రాజు అంటూ కిరీటం పెట్టాల్సిన పనిలేదు. దేశానికి వెన్నుముక అంటూ భుజకీర్తులు తగిలించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ‘ఉచితం’ అంటూ అనుచిత పథకాలు ప్రవేశపెట్టాల్సిన అవసరం కూడా లేదు. రైతు తన కష్టంతో తానే కొనుగోలు చేస్తున్న విత్తనాలను నాణ్యంగా ఇవ్వండి. ఎరువులు, పురుగు మందులు కల్తీ లేకుండా చూడండి. ఇవన్నీ అందుబాటులో ఉంచండి. ప్రతీవస్తువుకు తయారీదారుడే ధర నిర్ణయిస్తాడు. కానీ.. పంటకు మాత్రం వ్యాపారి రేటు పెడతాడు. ప్రజల అవసరాల దృష్ట్యా రైతు చేతుల్లో ధర నిర్ణయం లేకుండా సర్కారు చూసి ఉండొచ్చు. కానీ.. రైతు కష్టం తెలియని వ్యాపారి చేతిలో ఆ నిర్ణయాధికారం పెట్టొద్దు. ప్రభుత్వమే ధర నిర్ణయించి, సర్కారు కొనుగోలు చేయాలి. ఇది చేస్తే.. చాలు. ఏ రైతు ఎవరి ముందూ చేతులు చాచాల్సిన అవసరం.. అగత్యం రాకుండాపోతాయి. ఇది కనీస బాధ్యతగా ప్రభుత్వాలు గుర్తించినప్పుడే అన్నదాతకు న్యాయం జరుగుతుంది. లేదంటే.. ఇప్పటికే ఎంతో మంది వ్యవసాయాన్ని వదిలేసి ఇతర రంగాలకు మారిపోతున్నారు. ఈ పరిస్థితి మరింత ముదిరితే.. ఈ దేశంలో రైతు అనేవాడే కనుమరుగైపోతాడు.
Tags:    

Similar News