ముగ్గురు మంత్రులు ఔట్.. ముఖ్యమంత్రి నిర్ణయం?

Update: 2021-04-03 11:30 GMT
తెలంగాణ‌లో ముగ్గురు మంత్రుల‌కు ప‌ద‌వీ గండం పొంచి ఉందా? షార్ట్ లిస్టు కూడా రెడీ అయ్యిందా? అనే ప్ర‌శ్న‌ల‌కు అవును అనే స‌మాధాన‌మే వినిపిస్తోంది. వ‌చ్చే నెల‌లో కేసీఆర్ మంత్రి వ‌ర్గాన్ని పున‌ర్ వ్య‌వ‌స్థీక‌రించ‌బోతున్నార‌ని ప్ర‌చారం సాగుతున్న నేప‌థ్యంలో ఆ ముగ్గురిపై వేటు ప‌డ‌నుంద‌ని అని చ‌ర్చ సాగుతోంది. మ‌రి, ఎవరా ముగ్గురు?

ఎమ్మెల్యేల‌కు మార్కులు వేస్తున్నా.. వారి వారి మార్కుల‌ను బ‌ట్టే ఎన్నిక‌ల్లో టిక్కెట్లు ఉంటాయ‌ని అప్ప‌ట్లో ప్ర‌క‌టించారు కేసీఆర్. ఓ సారి మార్కులు వెల్ల‌డించారు కూడా. ఆ త‌ర్వాత ఆ ఊసు లేదుకానీ.. మంత్రుల విష‌యంలో మాత్రం ఈ మార్కుల ప‌ట్టికను ప‌క్కాగా ఫాలో అవుతున్నార‌ట‌. ప్ర‌తీ మూడు నెల‌ల‌కు ఒక‌సారి ఇంటెలిజెన్స్ ద్వారా మంత్రుల ప‌నితీరుపై నివేదిక తెప్పించుకుంటున్నార‌ని స‌మాచారం. ఆ నివేదిక‌ల‌ను బ‌ట్టి త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌లో ముగ్గురిని ప‌క్క‌న‌బెట్ట‌నున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది.

ఆ ముగ్గురిలో జీహెచ్ఎంసీకి చెందిన మంత్రి ఒక‌రు ఉన్న‌ట్టు తెలుస్తోంది. అదేవిధంగా.. క‌రీంన‌గ‌ర్ జిల్లాకు చెందిన మంత్రి ఒక‌రు ఉన్న‌ట్టుగా టీఆర్ఎస్ భ‌వ‌న్ నుంచి మీడియాకు లీకులు అందుతున్నాయ‌ట‌. అయితే.. మిగిలిన మూడో వ్య‌క్తి ఎవ‌ర‌నేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేద‌ని స‌మాచారం.

ఇక‌, ఎప్పుడైతే మంత్రుల‌ను ప‌క్క‌న‌పెడ‌తార‌నే ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చిందో.. ఆశావ‌హులు త‌మ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసిన‌ట్టు తెలుస్తోంది. వీరిలో కౌన్సిల్ చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, ఖ‌మ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి, జ‌డ్చెర్ల ఎమ్మెల్సీ ల‌క్ష్మారెడ్డి, హ‌న్మ‌కొండ ఎమ్మెల్యే దాస్యం విన‌య్ భాస్క‌ర్ తోపాటు బాల్క సుమ‌న్ కూడా రేసులో ఉన్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది.

అయితే.. త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌వితకు కూడా కేసీఆర్ మంత్రి ప‌ద‌వి ఇవ్వొచ్చ‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రికొంద‌రు మాత్రం ఇప్ప‌ట్లో ఇవ్వ‌క‌పోవ‌చ్చ‌ని అంటున్నారు. ఇప్ప‌టికే కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ముగ్గురు ఉన్నారు. క‌విత కూడా ఇస్తే.. విమ‌ర్శ‌లు మ‌రింత ఎక్కువ అవుతాయ‌ని, అందువ‌ల్ల ఆమెకు కేబినెట్ సీటు ఇవ్వ‌క‌పోవ‌చ్చ‌ని అంటున్నారు.

ఏప్రిల్ 17న‌ జ‌ర‌గ‌నున్న నాగార్జున సాగ‌ర్ ఉప  ఎన్నిక అనంత‌రం.. ఈ మంత్రివ‌ర్గ పున‌ర్ వ్యవ‌‌స్థీక‌ర‌ణ‌పై ముఖ్య‌మంత్రి నిర్ణ‌యం తీసుకోవ‌చ్చ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి, ఆ ముగ్గురు ఎవ‌ర‌నేది తేలాల్సి ఉంది.
Tags:    

Similar News