అమెరికన్లు ఆ భూమిని దొంగలించారా? టెక్సాస్ స్పీచ్ లో భారతీయ యువతి వ్యాఖ్యలు.. ఆలోచనలో అమెరికన్లు..!

అమెరికాలోని టెక్సాస్‌లో భారత సంతతి మహిళ అంకిత చేసిన సాహసోపేతమైన ప్రసంగం, ఆమె ఇచ్చిన గట్టి కౌంటర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.;

Update: 2026-04-10 06:09 GMT

అమెరికాలోని టెక్సాస్‌లో భారత సంతతి మహిళ అంకిత చేసిన సాహసోపేతమైన ప్రసంగం, ఆమె ఇచ్చిన గట్టి కౌంటర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. జాత్యహంకార వ్యాఖ్యలకు ఆమె తన మాటలతో చెక్ పెట్టిన తీరు ప్రపంచాన్ని సైతం ఆకట్టుకుంది.

ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు ఎదురుతిరగడం కంటే గొప్ప సమాధానం ఏముంటుంది. తమని తాము ఈ దేశ అసలైన వారసులమని భావిస్తూ, వలసదారులపై విద్వేషాన్ని కురిపిస్తున్న కొందరికి ఒక భారత సంతతి మహిళ గట్టి షాక్ ఇచ్చింది. టెక్సాస్‌లోని ఫ్రిస్కో సిటీ కౌన్సిల్ సమావేశం వేదికగా ఆమె చేసిన ప్రసంగం ఇప్పుడు జాత్యహంకార శక్తుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ‘ఇది దొంగిలించిన భూమి.. మీరు కూడా వలస వచ్చిన వారే’ అంటూ ఆమె వినిపించిన గళం అమెరికాలో భారతీయుల పట్ల పెరుగుతున్న వ్యతిరేకతకు ఒక బలమైన నిరసనగా మారింది.

సిటీ కౌన్సిల్ సమావేశంలో

టెక్సాస్‌లోని ఫ్రిస్కో సిటీ కౌన్సిల్ సమావేశంలో ఇటీవల భారతీయ సంతతిని లక్ష్యంగా చేసుకొని కొన్ని జాత్యహంకార వ్యాఖ్యలు చోటుచేసుకున్నాయి. పదేపదే కొందరు వ్యక్తులు ఈ వేదికపైకి వచ్చి భారత వ్యతిరేక, వలస వ్యతిరేక ప్రసంగాలు చేస్తూ ఉండటాన్ని ‘అంకిత’ అనే భారతీయ యువతి సహించలేకపోయింది. తన ప్రసంగ సమయాన్ని ఉపయోగించుకొని, జాత్యహంకారాన్ని వ్యాప్తి చేస్తున్న వారిని నేరుగా నిలదీసింది. బహిరంగ సమావేశాల్లో ఇలాంటి విషం చిమ్మడం వల్ల సమాజంలో భయం, శత్రుత్వం పెరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

చరిత్రను గుర్తుచేసిన అంకిత

తన ప్రసంగంలో అంకిత ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తావించింది. వలసదారులను నిందిస్తున్న వారు తాము కూడా ఐరోపా నుంచి వలస వచ్చిన వారి వారసులమే అన్న నిజాన్ని మర్చిపోయారని ఆమె గుర్తు చేసింది. అమెరికా అనే దేశం ఇక్కడి స్థానిక ప్రజల నుంచి తీసుకున్న ‘దొంగిలించబడిన భూమి’పై నిర్మించబడిందని ఆమె సూటిగా విమర్శించింది. దేశాభివృద్ధిలో వలసదారులు అందిస్తున్న సహకారాన్ని విస్మరించి, సామాజిక సమస్యలకు వారిని బలిపశువులను చేయడం తగదని ఆమె హెచ్చరించింది.

దేవాలయాలు, మసీదులపై దాడులపై..

ఫ్రిస్కోలోని దేవాలయాలు, మసీదుల వెలుపల హింసాత్మక గుంపులు ప్రదర్శనలు చేయడాన్ని అంకిత ఖండించింది. ఇలాంటి మతోన్మాద చర్యలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కౌన్సిల్‌ను డిమాండ్ చేసింది. బహిరంగ సమావేశాల్లో చేసే జాత్యహంకార వ్యాఖ్యలు శారీరకంగా హాని చేయకపోయినా, అవి మానసికంగా, భావోద్వేగపరంగా కమ్యూనిటీ సభ్యులను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఆమె ఎత్తి చూపింది.

భారతీయ పిల్లలే లక్ష్యం..?

మరో స్పీకర్ ప్రణవి ఛత్రథి కూడా ఈ సమావేశంలో మాట్లాడారు.. ఆన్ లైన్ లో భారతీయ-అమెరికన్ పిల్లలను ఎలా లక్ష్యంగా చేసుకుంటున్నారో వివరించారు. మునుపటి సమావేశాల్లో పాల్గొన్న బాయ్ స్కౌట్స్ ను వారు భారతీయులు కాబట్టి ఎగతాళి చేయడం అత్యంత హేయమైన చర్య అని పేర్కొన్నారు. నగరాన్ని ‘భారతదేశం స్వాధీనం చేసుకుంటోంది’ అంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాలను ఆమె తప్పుబట్టారు.

టెక్సాస్‌లో పెరుగుతున్న భారత వ్యతిరేక సెంటిమెంట్‌కు అంకిత, ప్రణవి ఇచ్చిన సమాధానం ఇప్పుడు వలసదారులందరికీ ధైర్యాన్ని ఇస్తోంది. అగ్రరాజ్యం అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఎంత కీలకమో అందరికీ తెలిసిందే.., కానీ ఇప్పుడు మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి జాత్యహంకార దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. అంకిత అన్నట్లుగా, మౌనంగా ఉండడం కంటే ఎదురుదాడి చేయడమే ఇలాంటి శక్తులకు సరైన మందు.



Tags:    

Similar News