తోట.. పిల్లి తగవులాట కొట్టుకునే వరకూ వెళ్లిందే

Update: 2016-10-21 06:13 GMT
టీడీపీ ఎమ్మెల్యే.. జగన్ పార్టీ ఎమ్మెల్సీల‌ మధ్య జరిగిన మాటల యుద్దం ఒకదశలో కొట్టుకునే వరకూ వెళ్లింది. దీంతో.. వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.ఈ ఘటన కాకినాడలో చోటు చేసుకుంది. నీటిపారుదల సలహా మండలి సమావేశంలో భాగంగా ఈ ఘటన చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరుకొని.. ఇద్దరూ కలయబడే వరకూ వెళ్లింది.

ఇంత రచ్చకు కారణంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పిల్లి లేవనెత్తిన ఒక అంశంగా చెప్పాలి. రామచంద్రాపురం నియోజకవర్గంలో శేరిలంక గ్రామం గోదావరి ప్రవాహానికి కోతకు గురి అవుతుందన్నారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే త్రిమూర్తులు..ఆ విషయంలో వాస్తవం ఉందని.. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 45 కిలోమీటర్ల మేర తారు రోడ్డు వేస్తే.. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక దాన్ని తవ్వేసి మట్టి రోడ్డు వేశారని.. అప్పటి నుంచి ఈ ఇబ్బంది ఉందన్నారు. ఈ సందర్భంగా ఆ కాంట్రాక్ట్ పని చేసిన కడప కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని త్రిమూర్తులు డిమాండ్ చేశారు.
Read more!

దీనిపై ఆగ్రహం వ్య‌క్తం చేసిన‌ పిల్లి ఏదో అనటం.. త్రిమూర్తులు దానికి మండిపడటంతో ఇరువురి మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఒక దశలో నువ్వెంత అంటే నువ్వెంత అన్న వరకూ వెళ్లిన సమయంలో.. నువ్వో పెద్ద వెధవవి అని బోస్ వ్యాఖ్యానించటం.. దీనికి ఆగ్రహం చెందిన త్రిమూర్తులు.. ఎక్కువ మాట్లాడితే లెంపకాయలు తగులుతాయని వ్యాఖ్యానించటంతో ఇరువురి మధ్య మాటలు పోయి.. చేతల వరకూ పరిస్థితి దిగజారింది. దీంతో.. అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొనటంతో అక్కడ నేతలు ఇరువురికి సర్ది చెప్పారు. ఈ సమావేశంలో వీరిద్దరి వివాదం చిన్నసైజు స్ట్రీట్ ఫైటింగ్ సీన్ లా మారిందని చెప్పాలి.
Tags:    

Similar News