పవన్, బాబు.. మిగిలిన వ్యూహం అదే!

Update: 2019-03-24 13:20 GMT
తొలి రోజు తెలంగాణలో సీమాంధ్రులపై దాడులు జరుగుతున్నాయనే స్టేట్ మెంట్ ను ఇచ్చారు పవన్ కల్యాణ్. అయితే ఆ ప్రకటన కొంత అభాసుపాలైంది. ఒకవైపు హైదరాబాద్ లో మెగా ఫ్యామిలీ దర్జాగా ఉంటే, తాము తెరాసకే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసినట్టుగా పవన్ కల్యాణ్ అన్న నాగబాబు ప్రకటించిన నేపథ్యంలో.. పవన్ కల్యాణ్ ఇచ్చిన స్టేట్ మెంట్ వివాదాస్పదం అయ్యింది కూడా. పవన్ కల్యాణ్ విధ్వేష రాజకీయాలు చేస్తూ ఉన్నారనే ఆరోపణ వినిపిస్తూ ఉంది.

ఇక పవన్ సంగతలా ఉంటే.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం చాన్నాళ్లుగా కేసీఆర్ నే నమ్ముకున్నారు. ఈ ఎన్నికలు కేసీఆర్ కు, తనకు మధ్య అని చంద్రబాబు నాయుడు పదే పదే ప్రకటించుకున్నారు. కేసీఆర్ తనకేదో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడని అన్నాడని, దాన్ని ఇవ్వాలని.. చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. ఇక తన ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా కేసీఆర్ ప్రస్తావన తీసుకు వస్తూనే ఉన్నారు. ప్రతి ప్రచార సభలోనూ కేసీఆర్ మీద బాబు దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు.

ఇలా పవన్, బాబు ఒకే ప్రసంగాన్నే కాస్త అటూ ఇటూగా తమ తమ శైలిలో చదువుతున్నారు. వీళ్లు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారంటే.. ఈ విషయంలో వినిపిస్తున్న విశ్లేషణ ఒకటే. పదే పదే ఇలా కేసీఆర్ ను విమర్శిస్తూ, కేసీఆర్ ప్రస్తావన తీసుకు వస్తుంటే.. కేసీఆర్ ఈ విషయంలో స్పందించకపోరా.. అలా స్పందించి కేసీఆర్ వీరిని విమర్శిస్తే.. అప్పుడు ఆ విమర్శలను సీమాంధ్రుల మీద దాడిగా అభివర్ణించాలనేది బాబు, పవన్ ల ప్రయత్నం అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

గత ఐదేళ్లలో తెలంగాణలో కానీ, హైదరాబాద్ లో కానీ సీమాంధ్రులపై ఎలాంటి భౌతిక దాడులు జరగకపోయినా.. వీరు దాడులు జరిగాయని అనేస్తున్నారు. వీరు కాపురం ఉంటున్నది హైదరాబాద్ లోనే  అయినా.. అక్కడ దాడులు జరుగుతుంటే తాము కాపాడుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఒకవైపు తమ తమ అవసరాలకు కేసీఆర్, కేటీఆర్ లో సమావేశం అవుతూ..కూడా వారిని ఏపీ ఎన్నికల వేళ విలన్లుగా చూపించి ప్రసంగాలు చేస్తూ ఉన్నారు.

ఇదంతా ఎందుకు జరుగుతోందంటే.. సెంటిమెంట్లు రగల్చడానికి అని స్పష్టమవుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.  ఇప్పుడు కేసీఆర్ రంగంలోకి దిగాలని, తమ విమర్శలకు ప్రతి విమర్శలు చేయాలని.. బాబు, పవన్ లను కోరుకుంటున్నారని, ఆ ప్రయత్నంలో భాగంగా పోలింగ్ లోపల ఈ ఇద్దరు నేతలూ మరిన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేసే అవకాశాలున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

కేసీఆర్ రంగంలోకి దిగాలని.. తమను విమర్శలను తప్పు పట్టాలని, ప్రతి విమర్శలు చేసి కేసీఆర్ తనదైన శైలిలో రెచ్చిపోవడమే పవన్, బాబుల కోరిక అని విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ విషయంలో ఇప్పటి వరకూ కేసీఆర్ స్పందించలేదు. అందుకే ఆయనను మరింతగా రెచ్చగొట్టే ప్రయత్నాలు జరిగే అవకాశాలున్నాయని స్పష్టం అవుతోంది.

    

Tags:    

Similar News