దేశంలోనే అతి సంపన్న బిచ్చగాడు బయటకొచ్చాడు

Update: 2015-07-03 14:28 GMT
ప్రపంచంలో అత్యంత సంపన్న వ్యక్తి ఎవరంటే వెంటనే చెప్పొచ్చు. అదే.. దేశంలోనే అత్యంత సంపన్నమైన పెద్దమనిషి ఎవరంటే కూడా తడుముకోకుండా చెప్పొచ్చు. అతనికున్న ఆస్తి.. దాంతో ఏమేం చేయొచ్చో లాంటివి చాలా రోటీన్‌ విషయాలు. అందులో పెద్ద ఆశ్చర్యకరమైన విషయాలు కూడా ఉండవు. ఇక.. అపర కుబేరుడు దాదాపుగా ఎక్కువ మార్పులు ఉండకపోవచ్చు.

మరి.. దేశంలోనే అత్యంత సంపన్న బిచ్చగాడు ఎవరంటే.. నోరు వెళ్లబెట్టచ్చు. బిచ్చగాళ్లలో సంపన్నులు కూడా ఉంటారా? అన్న సందేహం కలగొచ్చు. కానీ.. ఇది నిజం. విస్మయం రేకెత్తించే ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. రెండేళ్ల పాటు సాగించిన సర్వేతో దేశంలో అతి సంపన్న బిచ్చగాడు బయటకు వచ్చాడు.

ఈ సంపన్న బిచ్చగాడి పేరు భారత్‌ జైన్‌గా చెబుతున్నారు. అతగాడు.. ముంబయికి చెందిన బిచ్చగాడు. ఇక.. అతని అడ్డా కమ్‌ వ్యాపార స్థలం (లక్షల రూపాయిల ఆస్తి ఉన్న వ్యక్తి చేసే వృత్తిని వ్యాపారంగా చూస్తే బెటరేమో) ముంబయిలోని అత్యంత రద్దీగా ఉండే ఛత్రపతి శివాజీ టెర్మినల్‌తో పాటు అజాద్‌ మైదాన్‌. ఇతగాడు మిగిలిన వైట్‌కాలర్‌ జాబ్‌ హోల్డర్స్‌ కంటే నిక్కచ్చిగా వర్క్‌కి టైం కేటాయిస్తాడట.

కేవలం రోజులో ఎనిమిది నుంచి పది గంటలు మాత్రమే అడుక్కునే ఇతగాడి నెలవారీ ఆదాయం ఎంతో తెలుసా? జస్ట్‌ రూ.75వేలు మాత్రమే. ఇతగాడు రోజు గడిచిందంటే జేబులో తక్కువలో తక్కువ రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల వరకూ ఉండాల్సిందేనట. ఇది అతగాడి ఆ రోజు ఆదాయంగా చెబుతున్నారు. ఇక.. ఇతగాడికి సంబంధించి ఆసక్తికర విషయాలు చాలానే ఉన్నాయి సుమా.

రెండు సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్లతో పాటు.. ఒక షాపు కూడా ఉంది. షాపు మీద నెలకు రూ.10వేల అద్దె కూడా వస్తుందట. ఇతనికున్న ఆస్తుల విలువ రూ.80లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. బ్యాంకు బ్యాలెన్స్‌ లాంటి వివరాలు బయటకు రాలేదు.

తండ్రి.. భార్య.. ఇద్దరు పిల్లలతో పాటు సోదరుడుతో కలిసి ఉంటున్న ఈ సంపన్న బిచ్చగాడి పిల్లల్లో ఒకరు టెన్త్‌క్లాస్‌ చదువుతుంటే.. మరొకరు ప్లస్‌టూ చదువుతున్నారంట. సో.. బిచ్చగాళ్లలో ఏ రేంజ్‌ సంపన్నులు ఉంటారో అర్థమైందిగా.

Tags:    

Similar News