ఫ్లైఓవర్ మీద నిలిచిన ప్రధాని.. ఈ ప్రశ్నలకు సమాధానం ఎక్కడ?

Update: 2022-01-06 14:16 GMT
యావత్ దేశం షాక్ తిన్న పరిస్థితి. తిప్పి కొడితే 200 మంది కూడా లేని రైతుల నిరసనకు.. ఏకంగా దేశ ప్రధాన మంత్రి కాన్వాయ్ నడి రోడ్డు మీద నిలిచిపోవటం.. అది కూడా 20 నిమిషాల పాటు.. ముందుకు వెళ్లే అవకాశం లేకపోవటంతో.. వెనక్కి వెళ్లిన వైనాన్ని చూసినప్పుడు.. దేశ ప్రధాని భద్రత ఇంత లోపభూయిష్టంగా ఉంటుందా? అన్నది ప్రశ్నగా మారింది. ఇటీవల బిపిన్ రావత్ మరణానికి కారణమైన చాపర్ ప్రమాదంపై చైనా అధికార మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ విమర్శలు చేయటం.. అత్యున్నత స్థాయికి చెందిన వారి భద్రత విషయంలో ఇంత నిర్లక్ష్యమా? అంటూ  విమర్శలు చేయటంతో పాటు.. చులకన చేసేలా వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా చైనా మీడియా తీరుపై పలువురు మండిపడ్డారు.

మరి.. తాజాగా దేశ ప్రధాని ప్రయాణించేకాన్వాయ్ ను 200 మంది రైతులు నిలిపి వేయటం ఏమిటి? నిఘా వ్యవస్థ ఏమైంది? రాష్ట్ర పోలీసులు ఏం చేస్తున్నారు? ఇంతకు మించిన దారుణం ఇంకేం ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఈ ఎపిసోడ్ మొత్తం భద్రతా లోపాన్ని ఎత్తి చూపేలా చేసింది. జరిగిన ఘటనపై మండి పడిన కేంద్ర హోంశాఖ తక్షణ వివరణ ఇవ్వాలని.. బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం తగిన విధంగా రియాక్టు కాలేదని పేర్కొంది.

 ప్రధాని టూర్ సందర్భంగా చోటు చేసుకున్న భద్రతా లోపం సహించరానిదని.. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. అనూహ్య పరిణామాల మద్య ప్రధాని మోడీతాను చేయాల్సిన ఫిరోజ్ పూర్ ర్యాలీని రద్దుచేసుకోవటం తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ ఎపిసోడ్ కు సంబంధించి పలు ప్రశ్నలకు సమాధానాలు లభించని పరిస్థితి.

- తొలుత అనుకున్న దాని ప్రకారం భటిండా నుంచి హెలికాఫ్టర్ లో వెళ్లాల్సి ఉంది. 20 నిమిషాలు ఎదురు చూసిన తర్వాత కూడా వాతావరణం అనుకూలించకపోవటంతో.. రోడ్డు మార్గాన వెళ్లాలని నిర్ణయించారు. ఇందుకు 2 గంటల సమయం పడుతుంది. ఆ విషయాన్ని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వటం.. వారు తగిన ఏర్పాట్లు చేస్తామని చెప్పటం జరిగింది. మరెందుకు చేయలేదు?

-  200 మంది రైతులు దేశ ప్రధానిని ఆపేయగలరా?

-  నిరసన దిగిన రైతులతో పంజాబ్ పోలీసులు టీ తాగుతూ ఉన్న వీడియోలు బయటకు వచ్చాయి. ఓపక్కప్రధాని వస్తుంటే.. మరోవైపు అందుకు తగ్గట్లుగాఏర్పాట్లు చేయటంవదిలేసి.. అంత ఉదాసీనంగా ఎందుకు ఉన్నారు?

-  ప్రధాని మోడీ చేరుకోవాల్సిన గమ్యస్థానానికి 30 కిలోమీటర్లు ఉండగా.. పైరియాణా గ్రామ సమీపంలోని ఫ్లైఓవర్  వద్దకు ప్రధాని కాన్వాయ్ చేరుకోవటం.. వారికి కాస్త ముందుగా.. రైతులు నిరసన చేపట్టటం జరిగింది. సాధారణంగా.. వీవీఐపీల ప్రయాణించే మార్గంలో ఉన్న కల్వర్టులు.. ఫ్లైఓవర్లు.. వాటికి అనుసంధానంగా ఉండే రహదారులుమొత్తాన్నిఓపెన్ గా ఉంచుతారు. ఎందుకలా జరగలేదు?

-  దేశ ప్రధాని ఒక రాష్ట్ర రాజధానికి వస్తుంటే గవర్నర్.. ముఖ్యమంత్రి.. ఇతర ఉన్నతాధికారులు తప్పక ఆహ్వానం పలకాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా ప్రధాని మోడీకి రాష్ట్ర ఆర్థిక మంత్రి మాత్రమే స్వాగతం పలకటం ఎందుకు?

- పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వంలో గుండె కాయ లాంటి ముఖ్యమంత్రి కానీ.. కార్యనిర్వాహణ వ్యవస్థ మొత్తాన్నిశాసించే సీఎస్ కానీ.. భద్రతా వ్యవస్థ మొత్తం తన చేతిలో ఉండే డీజీపీ కానీ స్వాగతం పలికేందుకు ఎందుకు రాలేదు?

-  తన సిబ్బందిలో కొందరికి కరోనా సోకటం వల్ల తాను ప్రధానికిస్వాగతం పలికేందుకు రాలేదన్నారు. మరి.. సీఎస్.. డీజీపీలు ఎందుకు రానట్లు?

- ప్రధాని మోడీ ఆగిన ఫ్లైఓవర్ ఇవతల ఉన్నది కేవలం 200 మంది నిరసన కారులు మాత్రమే. వారిని తొలగించటం.. క్లియర్ చేయటం కూడా పంజాబ్ పోలీసులకు సాధ్యం కాకపోవటం ఏంటి?

- ప్రధాని ప్రయాణించే మార్గాన్ని క్లియర్‌ చేయడంలో పంజాబ్‌ పోలీసులు ఎందుకు విఫలమయ్యారు?

- నిరసనకారులకు ప్రధాని మోదీ రోడ్డు మార్గాన వెళుతున్నట్లు, ఫలానా రోడ్డులోనే వెళుతున్నట్లు ఎలా తెలుసు? వారికి ఈ సమాచారం ఎవరిచ్చారు?

-  ప్రధాని మోడీ రోడ్డు మార్గాన వస్తున్నారన్న విషయం 2 గంటల ముందు మాత్రమే తీసుకున్నది. అలాంటి వేళలో.. 2 గంటల వ్యవధిలో 200 మందితో నిరసన నిర్వహించేలా మెరుపు ఆలోచన సామాన్య రైతులకు అవకాశం ఉంటుందా?

- ప్రధాని భద్రతా సిబ్బందికి రైతులు  రోడ్డును దిగ్భందించారని తెలుసా?  తెలిస్తే ముందే ఎందుకు హెచ్చరించలేదు?

-  ప్రధాని ప్రయాణిస్తున్న మార్గాన్ని మార్చినట్లు స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూపు.. పంజాబ్‌ పోలీసులకు సమాచారాన్ని ఇచ్చిందా? ఒకవేళ ఇవ్వలేదనుకుంటే.. రైతులకు ఆ మార్గంలో ప్రధాని మోడీ వస్తున్నట్లు తెలీదు కదా?

- ఢిల్లీలో ఏడాది పాటు నిరసన తెలిపిన సమయంలో పంజాబ్ రైతులు ఎవరికి ఎలాంటి హాని కల్పించలేదని.. అలాంటి వారిపై లాఠీ ఛార్జి చేయలేమనటంలో అర్థమేమిటి? దేశ ప్రధాని అన్న తర్వాత.. ఆయన్ను అడ్డుకునే ప్రయత్నాన్ని మెరుపుదాడిలా చేసినోళ్లు ఎంత మంచి వాళ్లు అయినా ఉపేక్షించటం సరైనదా?
Tags:    

Similar News