ట్రంప్ కు తప్పిన పదవీగండం.. వీగిపోయిన అభిశంసన

Update: 2020-02-06 05:30 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు పదవీ గండం తప్పింది. ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆయనను పదవి నుంచి తప్పించేందుకు ప్రతిపక్ష డెమోక్రాట్లు దిగువ సభలో అభిశంసన తీర్మానం గత ఏడాది డిసెంబర్ లో ప్రవేశపెట్టారు.

ప్రతినిధుల సభలో ఆమోదం పొందిన అభిశంసన తీర్మానం సెనెట్ లో మాత్రం వీగిపోయింది. దీంతో ట్రంప్ అధ్యక్ష పదవికి గండం ముప్పు తప్పినట్టైంది.

రిపబ్లికన్ల ఆధిపత్యం ఉన్న సెనెట్ లో ప్రవేశపెట్టిన తీర్మానంపై బుధవారం ఓటింగ్ నిర్వహించారు. ఇందులో ట్రంప్ నకు అనుకూలంగా 52ఓట్లు.. వ్యతిరేకంగా 48 ఓట్లు పడ్డాయి. దీంతో 52-48 ఓట్ల తేడాతో ట్రంప్ బయటపడ్డారు. అధ్యక్ష పదవి నుంచి దిగిపోయే ముప్పు తప్పింది.

ట్రంప్ పై అభిశంసనకు ప్రధాన కారణం.. డెమొక్రాట్ల తరుఫున 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో పోటీచేస్తున్న జోబిడెన్ పై దుష్ప్రచారం చేయాల్సిందిగా ఉక్రెయిన్ అధ్యక్షుడిపై ట్రంప్ ఒత్తిడి తెచ్చారన్నది ఆరోపణ.. దీనిపై ప్రతినిధుల సభ ట్రంప్ పై అభిశంసన తీర్మానం పెట్టి ఆమోదించగా.. తాజాగా సెనెట్ వ్యతిరేకించి ట్రంప్ కు ఉపశమనం కలిగించింది.

కాగా అభిశంసన ఎదుర్కొన్న మూడో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రలో నిలిచారు. 243 ఏళ్ల అమెరికా చరిత్రలోనే అభిశంసన ద్వారా ఇంత వరకూ ఏ అధ్యక్షుడు పదవి నుంచి తప్పకోలేదు. తొలిసారిగా 1868లో అండ్రూ జాన్సన్, 1999లో బిల్ క్లింటన్ లు అభిశంసన ఎదుర్కొన్నారు. మద్దతు తో గట్టెక్కారు. రిచర్డ్ నిక్సన్ అనే అధ్యక్షుడు మాత్రం అభిశంసన ఎదుర్కోకుండా రాజీనామా చేశారు. వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ పడుతున్న ట్రంప్ కు ఈసారి విజయం అంత ఈజీ కాదన్న వాదన వినిపిస్తోంది.
Tags:    

Similar News