జగన్‌ అక్రమాస్తుల కేసులో మాజీ ఐఏఎస్‌లకు తెలంగాణ హైకోర్టు షాక్‌!

Update: 2022-11-29 10:44 GMT
జగన్‌ అక్రమాస్తుల కేసులకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇద్దరు మాజీ మాజీ ఐఏఎస్‌ అధికారులకు షాక్‌ ఇచ్చింది. బి.పి.ఆచార్య, కృపానందం వేర్వేరుగా దాఖలు చేసిన మూడు క్వాష్‌ పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. హెటిరో, అరబిందో, లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌లకు భూకేటాయింపుల కేసుల్లో బీపీ ఆచార్య నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో బీపీ ఆచార్యపై అభియోగాలను విచారణకు తీసుకుంటూ సీబీఐ కోర్టు వెలువరించిన నిర్ణయాన్ని తెలంగాణ హైకోర్టు సమర్థించింది. అవినీతి నిరోధక చట్టం (ఏసీబీ) కింద అభియోగాలను సీబీఐ కోర్టు విచారణకు తీసుకోవడాన్ని సవాలు చేస్తూ రెండు కేసుల్లోనూ అప్పటి ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) వీసీ, ఎండీగా పనిచేసిన బి.పి.ఆచార్య వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది.

అలాగే భారతి సిమెంట్స్‌ వ్యవహారంలో తనపై కేసును కొట్టేయాలని మరో మాజీ ఐఏఎస్‌ అధికారి కృపానందం దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కోర్టు కొట్టివేసింది.

ఈ మేరకు లేపాక్షి నాలెడ్జ్‌ హబ్, హెటిరో, అరబిందోల్లో నిందితుడుగా ఉన్న బి.పి.ఆచార్య దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ఇటీవల విచారణ చేపట్టారు. బి.పి.ఆచార్యపై 2012లో అభియోగపత్రం దాఖలు చేసినప్పుడు ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతి లేనందున కేవలం ఐపీసీ సెక్షన్ల కింద అభియోగాలపై సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది.

ఈ కేసును కొట్టేయాలని బీపీ ఆచార్య తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా విచారణను నిలిపివేస్తూ గతంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని  2021 సెప్టెంబరు వరకూ పొడిగిస్తూ వచ్చింది. 2016లో ఆచార్యను ప్రాసిక్యూషన్‌ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆచార్యపై రెండు కేసుల్లోనూ అవినీతి నిరోధక చట్టం (ఏసీబీ) కింద అభియోగాలను విచారణకు తీసుకోవాలని సీబీఐ మెమో దాఖలు చేసింది.

దీన్ని రద్దు చేయాలని కోరుతూ ఆచార్య హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిపై వాదనలను విన్న ప్రధాన న్యాయమూర్తి.. కేంద్రం ప్రాసిక్యూషన్‌కు అనుమతించినందున విచారణకు తీసుకోవడం సమర్థనీయమేనన్నారు. అందువల్ల బీపీ ఆచార్య పిటిషన్‌ను కొట్టివేస్తున్నామని తీర్పు ఇచ్చారు.

అలాగే వైఎస్సార్‌ జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన భారతి సిమెంట్స్‌కు లీజుల జారీలో కృపానందం అనుకూలంగా వ్యవహరించారని సీబీఐ ఆరోపించింది. ఈ వ్యవహారంలో సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కృపానందం కూడా పిటిషన్‌ దాఖలు చేశారు. దీన్ని కూడా కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ తీర్పు వెలువరించారు. కృపానందంపై విచారణ కొనసాగించడానికి సీబీఐ అభియోగపత్రంలో పేర్కొన్న కారణాలు సరిపోతాయని పేర్కొన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News