కేసీఆర్‌కు ఈ నిర్ణ‌యం మ‌రింత డ్యామేజీనే.. పొలిటిక‌ల్ డిబేట్‌!

Update: 2022-10-30 09:30 GMT
తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం, దీనికి సంబంధించి తాజాగా బ‌య‌ట పెట్టిన జీవో సంచ‌ల‌నంగా మారాయి. రాష్ట్రంలోకి సీబీఐని అనుమ‌తించేది లేద‌ని.. గ‌త ఆగ‌స్టులోనే కేసీఆర్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు చెబుతోంది. అయితే.. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు దీనిని బ‌య‌ట‌కు తీసుకురాలేదు. దీనికి కార‌ణాలు కూడా తెలియ‌దు. అయితే.. ఇప్పుడు ఒక‌కీల‌క కేసు తెర‌మీదికి రావ‌డం.. అందునా అత్యంత కీల‌క‌మైన ప్ర‌త్య‌ర్థి బీజేపీ త‌న పార్టీ టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేయ‌డం ప్రారంభించింద‌ని ప్ర‌చారం చేస్తున్న స‌మ‌యంలో ఇలాంటి నిర్ణ‌యం ఖ‌చ్చితంగా కేసీఆర్‌కు మైన‌స్ అవుతుంద‌నేది పొలిటిక‌ల్ వ‌ర్గాల మాట‌.

అంతేకాదు, తాజాగా వెలుగుచూసిన ఫామ్ హౌజ్ ఘ‌ట‌న‌, దీనిలో న‌లుగురు ఎమ్మెల్యేల‌కు ఒక్కొక్కరికి 100 కోట్ల రూపాయ‌ల చొప్పున ముడుపులు ఇచ్చి కొనుగోలు చేసేందుకు రెడీ అయిన వ్య‌వ‌హారం తీవ్ర‌స్థాయిలో సంచ‌ల‌నం రేపింది. పైగా ఇది జాతీయ స్థాయిలోనూ చ‌ర్చ‌గా మారింది దీనిలో బీజేపీ త‌ప్పు చేసింద‌ని, ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించే పార్టీగా బీజేపీని బ‌ద్నాం చేయాల‌ని కేసీఆర్ భావించి ఉంటార‌నే చర్చ కూడా ఉంది. ఈ నేప‌థ్యంలో బీజేపీ చేసిన కుట్ర నిజ‌మైతే అది బ‌య‌ట‌కు రావాలంటే సీబీఐ వంటి సంస్థ‌లే బ‌య‌ట‌కు తేగ‌ల‌వ‌ని కూడా భావిస్తున్నారు.

ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బీజేపీ కూడా బ‌లంగానే ఈ విష‌యంలో స్పందిస్తోంది. ఆరోప‌ణ‌లు రాగానే యాదాద్రికి వెళ్లిన తెలంగాణ బీజేపీ చీఫ్ త‌మ‌కు సంబంధం లేదంటూ త‌డిబ‌ట్ట‌ల‌తో ప్ర‌మాణం చేశారు. ఈ క్ర‌మంలోనేఆయ‌న కేసీఆర్‌కు కూడా స‌వాల్ రువ్వారు. అయితే, దీనిపై తెలంగాణ అధికార పార్టీ నుంచి ఎలాంటి స్పంద‌న లేక‌పోగా చెప్పులు మోసిన చేతులు అంటూ ఆక్షేపించారు. మ‌రోవైపు, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి కూడా వంద కోట్లు ఇచ్చి కొనుక్కోవాల్సిన అవ‌స‌రం బీజేపీకి లేద‌న్నారు.

ఇంకో వైపు ర‌ఘునంద‌న‌రావు, దీనిని కోర్టు వ‌ర‌కు తీసుకువెళ్లారు. సీబీఐ లేదా ఈడీతో విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు. ఈ పిటిష‌న్ విచార‌ణ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. మ‌రి కేసీఆర్ అండ్ కో త‌ప్పు చేశార‌ని చెబుతున్న‌వారే విచార‌ణ‌కు సిద్ధ‌ప‌డిన‌ప్పుడు త‌మ‌కు అన్యాయం చేస్తున్నార‌ని,త‌మ అధికారాన్ని లాక్కోవాల‌ని చూస్తున్నార‌ని ఆరోపిస్తున్న టీఆర్ ఎస్ దీనికంటే ఎక్కువ‌గానే దూకుడు ప్ర‌ద‌ర్శించి బీజేపీని మ‌రింత ఇరుకున పెట్టాల్సింది పోయి ఇప్పుడు సీబీఐ అస‌లు రాష్ట్రంలోకి రావ‌డానికి వీల్లేద‌ని పేర్కొన‌డం ద్వారా త‌న‌వైపే త‌ప్పు నిరూపించిన‌ట్టు అయింద‌ని అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు. ఇది మున్ముందు కేసీఆర్ ఇమేజ్‌కు ప్ర‌మాదం తీసుకురావ‌డం ఖాయ‌మ‌నే చ‌ర్చ‌కూడా జ‌రుగుతోంది.
Tags:    

Similar News