‘టీ’ ఉద్యోగులు తమకు తామే రిలీవ్ అయ్యారు

Update: 2016-09-10 04:44 GMT
విభజన జరిగి రెండేళ్ల మూడు నెలలు దాటింది. ఇప్పటికీ ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తి కాలేదు. ఏ ప్రాంతానికి చెందిన వారిని ఆ ప్రాంతానికి బదిలీ చేయటం.. వారిని రిలీవ్ చేయటం లాంటి ప్రక్రియలు పూర్తి కాలేదు. ఎందుకిలా అనే దానికి సూటిగా సమాధానం చెప్పేవాళ్లు లేరు. నిన్నటికి నిన్న కాకినాడలో నిర్వహించిన పవన్ కల్యాణ్ ‘సీమాంధ్రుల ఆత్మగౌరవ సదస్సు’లో ఉద్యోగుల విభజన ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలని.. ఈ అంశంపై ఏపీ ముఖ్యమంత్రి  దృష్టి సారించాలని చెప్పారు. మరి.. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి ఎలా రియాక్ట్ అవుతారన్నది ఒక ప్రశ్న.

ఇదిలా ఉంటే.. తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులు కొందరు ఏపీ విద్యుత్ సంస్థలైన ఏపీ ట్రాన్స్ కో.. ఏపీ జెన్ కోలో పని చేస్తున్నారు. ఇటీవల వారికి వారు తమకు తాముగా విధుల నుంచి రిలీవ్ అవుతున్నట్లుగా లేఖలు ఇచ్చేశారు. అదే సమయంలో తమను చేర్చుకోవాలని తెలంగాణ విద్యుత్ సంస్థల్నికోరటం.. వారిని ఓకే చేసేయటం జరిగింది.

ఉద్యోగులు తమకు తాము రిలీవ్ అయినట్లుగా లేఖలు రాసుకోవటాన్నితీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇలాంటి వాటి వల్ల ఏపీ ట్రాన్స్ కో సర్వీసును సదరు ఉద్యోగులు కోల్పోతారని.. అనుమతి లేకుండా విధుల నుంచి గైర్హాజరు అయినట్లుగా భావించాల్సి ఉంటుందన్న అభిప్రాయాన్ని ఏపీ విద్యుత్ సంస్థలు స్పష్టం చేశాయి.ఇదిలా ఉంటే.. రిలీవ్ అయిన ఉద్యోగుల్ని తెలంగాణ విద్యుత్ సంస్థలు విధుల్లోకి చేర్చుకోవటంపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇలా ఎవరికి వారుగా ఉద్యోగులు తమకు తాముగా రిలీవ్ అయినట్లుగా లేఖ రాసిచ్చి.. తాము కోరుకున్న చోట్ల జాయిన్ అయిపోవచ్చా? దీనికి చట్టబద్ధత ఏమిటి? అంతకుముందు పని చేసిన సంస్థ అనుమతి లేకుండా ఇలాంటివి చేయొచ్చా? అన్నవి ప్రశ్నలుగా మారుతున్నాయి. ఏమైనా... ఇలాంటి తీరు సరికాదన్న వాదన పలువురిలో వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News