ఇప్పుడు ఏం చేద్దాం.. ఆశావ‌హుల అంత‌ర్మ‌థ‌నం..!

Update: 2022-07-29 00:30 GMT
ఔను.. ఇప్పుడు ఏపీలోని రెండు ప్ర‌ధాన పార్టీల నేత‌లు.. కూడా అంత‌ర్మ‌థ‌నంలో ప‌డిపోయారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని చాలా మంది ఆశావ‌హులు రెండు పార్టీలు.. వైసీపీ, టీడీపీల్లో పెరిగిపోయారు. మ‌రోవైపు జంపింగ్ నాయ‌కులు.. కూడా ఎదురు చూస్తున్నారు. ఇక‌, మ‌రికొంద‌రు వార‌సులు.. ఇలా.. ఒకే నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఇద్ద‌రు నుంచి ముగ్గురు నాయ‌కులు టికెట్ ల కోసం.. ఎద‌రు చూస్తున్నారు. ఈ ప‌రిణామాల‌తో పార్టీలు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నాయి.

అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్ విభ‌జ‌న‌జ‌రుగుతుంద‌ని.. తద్వారా.. నియోజ‌క వ‌ర్గాలు పెరిగితే.. ఆశావ‌హుల‌ను అందులో స‌ర్దుబాటుచేయొచ్చ‌ని.. పార్టీలు భావిస్తున్నారు. ఈ విష‌యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు చాలా ముందున్నారు.

ఆయ‌న గ‌త ఎన్నిక‌ల‌కు ముందు నుంచి కూడా.. ప్ర‌య త్నాలు చేస్తున్నారు. అయితే.. దీనికి జ‌నాభా లెక్క‌లు అడ్డు త‌గిలాయి. దీంతో గ‌త ఎన్నిక‌ల్లో ఆశావాహుల‌ను రెండు పార్టీలూ చాలా మేర‌కు బుజ్జ‌గించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

అధికార వైసీపీలో ప‌రిస్థితి మ‌రీ ఘోరంగా ఉంది. ఇప్ప‌టికే అక్క‌డ బండి ఓవ‌ర్ లోడ్ అయిపోయింది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. ఎన్నిక‌ల త‌ర్వాత టీడీపీ, ఇత‌ర పార్టీల నుంచి ప‌లువురు నాయ‌కులు వైసీపీలోకి వెళ్లిపోయారు. దీంతో ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ పార్టీ నుంచే పోటీ చేసేందుకు నాయ‌కుల మ‌ధ్య తీవ్ర‌మైన పోటీ ఉంది. ఇక్క‌డ టిక్కెట్లు రాని వాళ్లు జంప్ చేసేందుకు కూడా వెనుకాడ‌డం లేదు.

వైసీపీలో ఇప్ప‌ట‌కీ ప‌ద‌వులు రాని వారు వ‌చ్చే ఎన్నికల్లో అయినా.. త‌మ‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని.. ఆశావ‌హులు ఆశ‌లు పెట్టుకున్నారు. దీనికి కార‌ణం.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికైనా నియోజ‌క‌వ‌ర్గాల విభ‌జ‌న జ‌రిగితే.. ఏపీలో 50 స్థానాలు అందివ‌స్తాయ‌ని అనుకున్నారు.

కానీ, ఇప్పుడు ఈ గ‌డువు మ‌రో నాలుగేళ్లు పెరిగింది. అంటే.. 2026 వ‌ర‌కు కూడా నియోజ‌క‌వ‌ర్గాల విభ‌జ‌న జ‌ర‌గ‌బోద‌ని.. చెప్పుకొచ్చారు. ఇదే విష‌యం.. కేంద్రం స్ప‌ష్టంగా చెప్ప‌డంతో ఇప్పుడు రెండు పార్టీల్లోనూ ఆశావ‌హులు త‌ల్ల‌డిల్లుతున్నారు. మ‌రి పార్టీల అధినాయ‌కులు ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News