వైసీపీకి టీడీపీ మ‌ద్ద‌తు.. ష‌ర‌తులు ఇవే!

Update: 2022-02-14 02:30 GMT
బ‌ద్ధ శ‌త్రువులైన రెండు పార్టీలు క‌లిసి ప‌నిచేస్తాయా?  ఏపీ కోసం.. ఆ మాత్రం చేయ‌క‌పోతే.. ఎలా అంటున్నారు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం నాయ‌కులు. ఏపీలో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ రాజ‌కీయాలు అంద‌రికీ తెలిసిందే. ఒక‌రిపై ఒక‌రు యుద్ధం చేసుకునే నేత‌లు.. నిత్యం రాజ‌కీయ క‌ల‌హాల‌తో తీరిక లేకుండా ఉంటున్న నాయకులు.. కేసులు.. ఆరోప‌ణ‌లు.. విమ‌ర్శ‌ల‌తో మీడియాను వేడెక్కించే నేత‌లు.. ఇప్పుడు ఒకే విష‌యంపై క‌లిసి వ‌స్తే.. ఎలా ఉంటుంది? అదే ప్ర‌త్యేక హోదా!

ఈ విష‌యంలో వైసీపీతో క‌లిసి ప‌నిచేసేం దుకు.. కేంద్రంపై పోరాటం చేసేందుకు తాము సిద్ధ‌మ‌ని టీడీపీ నాయ‌కులు ప్ర‌క‌టించారు. తాజాగా హోదా అంశంపై చ‌ర్చించేందుకు రెడీ అయి, చివ‌రి నిముషంలో వెన‌క్కి త‌గ్గిన‌.. కేంద్రాన్ని నిల‌దీయాల‌ని టీడీపీ ప‌ట్టుబ‌డుతోంది.

ఈ క్ర‌మంలో అవ‌స‌ర‌మైతే.. వైసీపీతో క‌లిసి పోరాటం చేసేందుకు తాము రెడీ అనిటీడీపీ ఎంపీ క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర కుమార్ తాజా గా వ్యాఖ్యానించారు. వైసీపీ  ఎంపీలు రాజీనామా చేసి ప్రత్యేక హోదాపై పోరాడితే.. తామూ కలసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామ ని  కనకమేడల రవీంద్ర కుమార్ ప్రకటించారు.

ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎలాంటి కార్యాచరణకు సిద్ధ‌మైనా తమ మద్దతు ఉంటుందని తెలిపారు. వైసీపీకి అటు లోక్‌స‌భ‌, ఇటు రాజ్య‌స‌భ‌లో క‌లిపి 28 మంది ఎంపీలున్నార‌ని ఆయ‌న చెప్పారు. అయితే.. ప్ర‌త్యేక హోదా అంశంపై కేంద్రంపై ఒత్తిడి తేవట్లేదని విమర్శించారు. హోదాకు తెలంగాణ సహకారం ఉన్నా వైసీపీ ఎందుకు వైఫల్యం చెందుతుందో అర్థం కావట్లేదన్నారు.

ఇరు రాష్ట్రాల విభ‌జ‌న స‌మ‌స్య‌లపై ఈ నెల 17న చ‌ర్చించేందుకు కేంద్రం సిద్ధ‌మైంద‌న్న క‌న‌క‌మేడ‌ల‌.. ఈ అజెండాలో ప్రత్యేక హోదా అంశం ఎందుకు పెట్టలేదని ప్ర‌శ్నించారు. తొలుత పెట్టి వెంట‌నే వెన‌క్కి ఎందుకు తీసుకున్నార‌ని అన్నారు.వైసీపీ ప్రభుత్వానికి కేంద్రంతో ఉన్న ఒప్పందమేంటని నిల‌దీశారు. అజెండా మారడానికి జగన్‌ కేంద్రానికి రాసిన లేఖనే కారణమ‌ని దుయ్య‌బ‌ట్టారు. వైసీపీకి 28 మంది ఎంపీలున్నా కేంద్రంపై ఒత్తిడి తేవట్లేదన్నారు. హోదాకు తెలంగాణ సహకారం ఉంద‌ని.. గ‌తంలోనే కేసీఆర్ కుమార్తె కల్వ‌కుంట్ల క‌విత ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేశార‌ని తెలిపారు.

అయిన‌ప్ప‌టికీ.. వైసీపీ ఎంపీలు ఎందుకు వైఫ‌ల్యం చెందుతున్నార‌ని నిల‌దీశారు. ప్రత్యేక హోదా అంశంపై వైసీపీ వైఫల్యమా ? లొంగుబాటా ?  చెప్పాల‌న్నారు. వైసీపీపై త‌మ‌కు అనుమానం కలుగుతోందన్నారు. ``అజెండాలో హోదా అంశం ఎవరు చెబితే తొలగించారు?. హోదాపై మంచైతే వైసీపీకి.. చెడైతే చంద్రబాబుపై నెడుతున్నారు.

ప్రాణమిత్రులు విభజన హామీలు ఎలా పరిష్కరిస్తారో చెప్పాలి?``అని క‌న‌క‌మేడ‌ల నిల‌దీశారు. వైసీపీ వల్ల కాదని జగన్‌ చెబితే మా కార్యాచరణ ప్రకటిస్తామ‌న్నారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ పోరాడితే తాము కూడా క‌లిసి వ‌స్తామ‌ని తెలిపారు. హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. వైసీపీ  ఎంపీలతో పాటు తాము కూడా రాజీనామా చేస్తామ‌న్నారు. కేంద్రం హోదా ఇవ్వకపోతే వైసీపీ కార్యాచరణ ఏంటో చెప్పాలని క‌న‌క‌మేడ‌ల డిమాండ్ చేశారు.
Tags:    

Similar News