రాబోయే ఐదేళ్లూ.. రాజ్యసభలో టీడీపీ జీరో!

Update: 2019-05-27 14:30 GMT
మొన్నటి వరకూ పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీ ప్రముఖమైన స్థానంలో నిలిచింది. అయితే ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పుతో తెలుగుదేశం పార్టీ ఒక్కసారిగా లోక్ సభలో సింగిల్ డిజిట్ స్థాయికి పడిపోయింది. కేవలం మూడు ఎంపీ సీట్లకు పరిమితం అయ్యింది. కేంద్రంలో చక్రం తిప్పడం.. అంటూ ఫలితాలు వచ్చే ముందు రోజు వరకూ ఢిల్లీ వెళ్లి చంద్రబాబు నాయుడు హల్ చల్ చేశారు.  అయితే తీరా వచ్చింది కేవలం మూడు ఎంపీ సీట్లు.

ఎలాగూ కేంద్రంలో బీజేపీకి ప్రజలు పూర్తి మెజారిటీ ఇచ్చేశారు. కాబట్టి చంద్రబాబుకు కూటమితో చక్రం తిప్పడానికి అవకాశం లేకుండా పోయింది. లోక్ సభలో టీడీపీకి ఉన్నది 3 ఎంపీల బలమే కావడంతో సభలో ఆ పార్టీకి మాట్లాడే అవకాశం దక్కే సందర్భాలు కూడా తక్కువగానే ఉండబోతున్నాయి.

లోక్ సభ సంగతలా ఉంటే.. రాజ్యసభలో కూడా రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. ఏపీ అసెంబ్లీ కోటాలో తెలుగుదేశం పార్టీ రాజ్యసభకు నేతలను పంపే అవకాశం ఉంటుంది. అయితే ఏపీ అసెంబ్లీ కోటాలో ఒక రాజ్యసభ సభ్యుడు ఎన్నిక కావాలంటే కావాల్సిన కనీస బలం నలభై ఏడు మంది ఎమ్మెల్యేల ఓట్లు!

తెలుగుదేశం పార్టీకి ఏపీలో ఈ ఎన్నికల్లో దక్కింది కేవలం ఇరవై మూడు ఎమ్మెల్యే సీట్లు! దీంతో తెలుగుదేశం పార్టీ తరఫున ఏ ఒక్కరూ రాజ్యసభకు ఎన్నిక అయ్యే అవకాశం ఉండదని స్పష్టం అవుతోంది. రాబోయే ఐధేళ్లలో కనీసం పదకొండు రాజ్యసభ సీట్లు ఏపీ కోటాకు దక్కనున్నాయి. వాటన్నింటినీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకునే అవకాశం ఉంది.

తెలుగుదేశం పార్టీ తరఫున ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న వాళ్లంతా ఒక్కొక్కరుగా రిటైర్డ్ కావడం.. వారి స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  నేతలు ఎంపీలుగా రాజ్యసభలోకి ఎంటర్ కావడం జరిగే సన్నివేశాలుంటాయి రాబోయే ఐదు సంవత్సరాల్లో!


Tags:    

Similar News