జేసీ పవన్ పై ఇండిపెండెంట్ గా టీడీపీ నేత!

Update: 2019-03-24 09:56 GMT
ఇప్పటికే కల్యాణదుర్గం నుంచి ఇండిపెండెంట్ గా బరిలో నిలిచిన ఉన్నం హనుమంతరాయ చౌదరి మరో ఆసక్తిదాయకమైన నిర్ణయం తీసుకున్నారట. ఆయన అనంతపురం నుంచి ఎంపీగా కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని అనుకుంటున్నారట. ఈ మేరకు అనంతపురం ఎంపీగా స్వతంత్రుడిగా నామినేషన్ వేసేందుకు ఆయన ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నట్టుగా సమాచారం.

తనకు కల్యాణదుర్గం అసెంబ్లీ టికెట్ దక్కలేదు అని హనుమంతరాయ చౌదరి బాగా అసహనంతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వం తనకు దక్కినా దక్కకపోయినా పోటీలో ఉండటమే అని ఆయన తొలి రోజే వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. అనుకున్నట్టుగానే ఆయనకు టీడీపీ అభ్యర్థిత్వం దక్కలేదు. మాదినేని ఉమామహేశ్వర్ నాయుడుకు అక్కడ టీడీపీ ఎమ్మెల్యే టికెట్ దక్కింది.

తను పోటీలో ఉన్నట్టే అంటూ హనుమంతరాయ చౌదరి ప్రచారం చేసుకొంటూ పోతున్నారు. ఇక ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి మీద కూడా హనుమంతరాయ చౌదరికి బాగా ఆగ్రహావేశాలున్నాయట. అందుకే.. ఆయన అనంతపురం నుంచి కూడా ఎంపీ   అభ్యర్థిగా ఇండిపెండెంట్ గా బరిలోకి నిలవబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

తనకు ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడానికి జేసీ దివాకర్ రెడ్డి చేసిన రాజకీయమే కారణమని హనుమంతరాయ చౌదరి భావిస్తున్నట్టుగా సమాచారం. అందుకే జేసీ పవన్ ను లక్ష్యంగా చేసుకుని ఆయన ఇండిపెండెంట్ గా బరిలోకి దిగబోతున్నారట.

అసలే అనంతపురం పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లకు పోటీ చేస్తు్న్న టీడీపీ అభ్యర్థులు జేసీ వర్గం మీద అసహనంతో ఉన్నారు. ప్రభాకర్ చౌదరి, జితేంద్రగౌడ్ తదితరులకు జేసీతో అసలు పడటం లేదు.ఈ నేపథ్యంలో అనంతపురం ఎంపీ సీటు నుంచి హనుమంతరాయచౌదరి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగితే.. భారీగా క్రాస్ ఓటింగ్ ఉండే అవకాశాలు లేకపోలేదు.


Tags:    

Similar News