లెక్క తప్పిందా? సౌండ్ పెంచిన భట్టి.. తలసాని కామ్ అయ్యారే

Update: 2020-09-20 10:50 GMT
ఎవరి లెక్కలు వాళ్లకుంటాయ్. ఇక్కడ అందరూ తెలివైనోళ్లే.. అన్నట్లుగా ఉంది తెలంగాణలోని రాజకీయ వ్యవహారం ఒకటి. సమకాలీన రాజకీయాల్లో ఎప్పుడూ లేని రీతిలో చోటు చేసుకున్న పరిణామం అందరిని ఆశ్చర్యపోయేలా చేసింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించి ‘లక్ష’ మాటను లక్షణంగా చెప్పుకుంటే.. అంత ఎక్కడ ఉందంటూ కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు.

దీంతో కల్పించుకున్న మంత్రి తలసాని.. కావాలంటే ప్రభుత్వమే వాహనాల్ని ఏర్పాటు చేస్తుందని.. లక్ష లెక్క చూపిస్తామని సవాలు విసిరారు. సరే అంటే సరే అనుకున్నారు ఇద్దరు నేతలు. సభ వాయిదా పడింది. అనూహ్యంగా మంత్రి తలసాని భట్టి ఇంటికి వెళ్లటం.. లక్ష లెక్క చూపిస్తానని చెప్పిన మంత్రి తలసాని వెంట వెళ్లారు. తొలిరోజున నాలుగైదు ప్రాంతాల్లో చూపించిన తలసాని.. ప్రభుత్వం అదరగొట్టేస్తుందన్నట్లుగా వ్యాఖ్యలు చేయటం.. దీనిపై భట్టి వెర్షన్ మీడియాలో పెద్దగా ఫోకస్ కాలేదు. దీంతో తలసాని రాజకీయాల్లో కొత్త ఒరవడికి నాంది పలికారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

మొదటిరోజు ఉత్సాహాన్ని రెండో రోజూ కొనసాగించారు మంత్రి తలసాని. పొద్దున్నే భట్టి ఇంటికి బయలుదేరటం.. మీడియాకు ఆ సమాచారాన్ని పంపారు. అంతా తాను రాసుకున్న స్క్రిప్టుకు తగ్గట్లే అంతా జరుగుతుందని భావిస్తున్న వేళ.. భట్టి ఇచ్చిన ట్విస్టు మంత్రి తలసానికి దిమ్మ తిరిగే షాకిచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ లో లక్ష ఇళ్లు కట్టినట్లుగా గొప్పలు చెప్పి.. 3428 ఇళ్లు మాత్రమే చూపించారని.. మిగిలినవన్నీ హైదరాబాద్ శివారులోనే ఉన్నాయంటూ అసలు లెక్కను విప్పి చెప్పారు.

మహేశ్వరం నియోజకవర్గంలో ఇళ్లు చూపించి గ్రేటర్ ప్రజలకే ఇవన్నీ అంటున్నారని.. తుక్కుగూడ మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇవే ఇళ్లను చూపించిన ఓట్లు వేయించుకోవటాన్ని భట్టి గుర్తు చేశారు. మేడ్చల్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఉన్న ఇళ్లను చూపించి.. అవన్నీ జీహెచ్ ఎంసీ ఇళ్లు అని ఎలా చెబుతారంటూ క్వశ్చన్ చేస్తున్నారు.

మొత్తంగా తాను తిరిగిన రెండు రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ లో కట్టిన ఇళ్ల లెక్క విషయంలో భట్టి క్లారిటీగా చెప్పటమే కాదు.. అధికారపక్షం చూపించిన వాటిల్లో గ్రేటర్ పరిధిలో ఉన్నవి ఎన్ని? శివారు జిల్లాలకు చెందినవి ఎన్ని? అన్న విషయాన్ని చెప్పటం మొదలు పెట్టగానే మంత్రి తలసాని కామ్ అయిపోవటం గమనార్హం.

తొలి రోజు తనదే విజయంగా చెప్పుకున్న తలసాని.. రెండో రోజు తిరిగే సరికి బొమ్మ తేడా పడటమే కాదు.. తెలివి తమకు మాత్రమే కాదు.. సీఎల్పీనేత భట్టికి కూడా ఉందన్న విషయాన్ని అర్థం చేసుకున్నారు. ఈ విషయంలో మరింత ఉత్సాహాన్ని ప్రదర్శిస్తే మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని గుర్తించారో ఏమో కానీ.. తెలంగాణ అధికార పక్షం మౌనముద్ర దాల్చింది. ఎప్పుడైతే తన పట్టు పెరిగిందన్న విషయం అర్థమైందో భట్టి సౌండ్ పెంచితే.. తలసాని కామ్ అయ్యారు. ప్రత్యర్థిని బోల్తా పడేద్దామన్న ప్రయత్నం అధికారపార్టీకి కొత్త ఇరకాటంలో పడేలా చేసిందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News