రూ.కోటి లాటరీ తగిలింది.. అత్యాశకు పోయి కిడ్నాప్ అయ్యాడు
కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక పోయిందన్న సామెతను గుర్తు చేసే ఉదంతం కేరళలో చోటు చేసుకుంది.;
కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక పోయిందన్న సామెతను గుర్తు చేసే ఉదంతం కేరళలో చోటు చేసుకుంది. అత్యాశకు పోయి.. గెలుచుకున్న లాటరీ టికెట్ పోగొట్టుకోవటమే కాదు.. ఏకంగా కిడ్నాప్ అయిన షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..
అదృష్టం అరచేతిలో ఉన్నప్పుడు అద్భుతాలే జరుగుతాయి. అదే సమయంలో అత్యాశకు పోతే.. ఎక్కడో ఉన్న దురదృష్టం ఏకంగా బ్యాక్ పాకెట్ లోకి వచ్చి కూర్చుంటుంది. తాజా ఉదంతం కూడా అలాంటిదే. కేరళలోని పెరవూర్ కు చెందిన 46 ఏళ్ల సాధిక్ డిసెంబరు 30న స్త్రీ శక్తి లాటరీలో రూ.కోటి ప్రైజ్ మనీ సొంతం చేసుకున్నాడు. లాటరీ గెలుచుకున్న తర్వాత.. బుద్ధిగా వెళ్లి.. అధికారికంగా కట్టాల్సిన పన్ను వగైరాలు కట్టేసి.. ప్రైజ్ మనీ తీసుకుంటే అసలీ వార్తే ఉండేది కాదు.
అత్యాశకు పోయి.. రూ.కోటి లాటరీని బ్లాక్ లో అమ్మితే భారీగా డబ్బులు వస్తాయని భావించాడు. అదే.. అధికారికంగా తనకు తగిలిన లాటరీని ఇచ్చేస్తే.. పన్నులు పోను చేతికి వచ్చే ప్రైజ్ మనీ తక్కువ కావటం.. ప్రైజ్ మనీ ఆలస్యంగా చేతికి అందుతుందని భావించాడు. వెంటనే డబ్బులు చేతికి వస్తాయని భావించిన అతను.. స్నేహితుడి సలహాతో బ్లాక్ లో అమ్మేందుకు ప్లాన్ చేశాడు.
తాము అనుకున్నట్లే బుధవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో పెరవూర్ టౌన్ లోని మంథాన ప్రాంతానికి చెందిన సాధిక్.. అతడి స్నేహితుడు చేరుకున్నారు. డబ్బులు ఇచ్చి లాటరీ టికెట్ ను కలెక్టు చేసుకోవటానికి వచ్చిన గ్యాంగ్.. వీరిని కారులో కిడ్నాప్ చేసుకొని వెళ్లిపోయారు. కొంత దూరం వెళ్లిన తర్వాత సాధిక్ స్నేహితుడ్ని విడిచి పెట్టి.. ఆ తర్వాత మరికాస్త దూరం వెళ్లిన తర్వాత ప్రైజ్ తగిలిన లాటరీ టికెట్ ను తీసుకొని సాధిక్ ను వదిలేశారు.
దీంతో.. అతను పోలీసుల్ని ఆశ్రయించాడు. సాధిక్ ఇచ్చిన ఫోన్ నెంబరు ఆధారంగా కిడ్నాప్ చేసిన ముఠాలోని ఒకడిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఉదంతం గురించి తెలిసినోళ్లంతా అత్యాశకు పోతే.. ఇలాంటివే జరుగుతాయన్న వ్యాఖ్య చేస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. సదరు గ్యాంగ్ కోసం గాలిస్తున్నారు.