సర్వేలో బయటపడిన బండారం ?

Update: 2021-06-13 11:30 GMT
ఈయనగారిని గుర్తు పెట్టారు కదా ? మూడు రోజుల క్రితంవరకు కాంగ్రెస్ లోనే ఉండేవారు. కాకపోతే ఇపుడు కాషాయం కండువా కప్పుకున్నారు. అవును ఈయనే జితిన్ ప్రసాద్. కాంగ్రెస్ లో ఉన్నపుడు ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్, ధౌరారా నుండి 2004, 09లో రెండుసార్లు ఎంపిగా గెలిచారు. తర్వాత రెండుసార్లు ధౌరారా నుండి ఓడిపోయారు. తర్వాత చాలా కాలం కామ్ గా ఉండి ఇపుడు హఠాత్తుగా బీజేపీలో చేరిపోయారు.

ఎప్పుడైతే జితిన్ కాంగ్రెస్ లో నుండి బీజేపీలోకి చేరిపోయారో వెంటనే కాంగ్రెస్ పనిపూర్తయిపోయిందంటు మీడియా నానా గోల చేసింది. నిజానికి కాంగ్రెస్ పని యూపీలో చాలా దశాబ్దాల క్రితమే అయిపోయింది. అయినా ఆ విషయం మరచిపోయి మీడియా నానా గోల చేసింది. దాంతో వైర్ అనే మరో మీడియా సంస్ధ జితిన్ కతేంటో చూద్దామని అనుకున్నట్లుంది.

అందుకనే బాగా ఆలోచించి ప్రశ్నం అనే సర్వే సంస్ధతో చేతులు కలిపింది. జితిన్ సామర్ధ్యం మీద సర్వే చేయాలని అనుకున్నది. ఆ బాధ్యతలను ప్రశ్నంకు అప్పగించింది. ప్రశ్నం సంస్ధ ప్రతినిధులు మాజీ ఎంపి ఫొటోను పట్టుకుని రంగంలోకి దిగేశారు. షాజహాన్ పూర్, ధౌరారా నియోజకవర్గాల్లో సుమారు 1500 మందిని కలిశారు. ఫొటో చూపించి ఎవరో తెలుసా ? అని అడిగారట.

రెండు నియోజకవర్గాల్లోని జనాల్లో చాలామంది జితిన్ ఫొటోను చూసి సినిమా యాక్టర్ అని బిజినెస్ మ్యాన్ అని చెప్పారట. తమకు ఎంపిగా పనిచేశారని చెప్పిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువట. తాను ఎంపిగా పనిచేసిన నియోజకవర్గాల్లోనే జనాలందరికీ జితిన్ ఎవరో కూడా సరిగా తెలీదు. ఇలాంటి నేత ఏ పార్టీలో ఉంటే ఏమిటి ? జితిన్ విషయంలో సర్వే చేసినట్లే ఎంపిలందరిపైనా సర్వే జరిపితే తమ ప్రతినిధిని ఎంతమంది గుర్తుపడతారో తేలిపోతుంది.
Tags:    

Similar News