సుప్రీం మూడు బెంచ్ ప్రస్తావన రేపటి కోసమేనా?

Update: 2015-11-28 06:50 GMT
విషయం ఉన్న తెలుగు నేతల్లో తెలంగాణ అధికార పక్షానికి చెందిన ఎంపీ వినోద్ కుమార్ ఒకరు. విషయంపై పట్టుతో పాటు.. విషయం ఏదైనా తనదైన శైలిలో వాదనను వినిపించటం.. అది విన్నవారు నిజమే కదా అన్న భావన కలిగేలా చేయటం ఆయనకు అలవాటే. తాజాగా ఆయనో అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దేశంలో మూడు సుప్రీం బెంచ్ లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

దక్షిణాధిన ఒకటి.. తూర్పు.. పశ్చిమాల్లో మరో రెండు.. మొత్తంగా మూడు సుప్రీం బెంచ్ ల ఏర్పాటు అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా లోక్ సభలో ఏర్పాటు చేసిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. సుప్రీంకోర్టు బెంచ్ ల మీద గళం విప్పారు. సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉండిపోవటంతో.. అక్కడకు రావాలంటే దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని.. సుప్రీంకోర్టుకు వచ్చేందుకు ఎక్కువ ఖర్చు అవుతుందన్న వాదనను తెరపైకి తీసుకొచ్చారు. తన వాదనకు బలమైన ఆధారాల్ని చూపిస్తూ.. తూర్పు.. పశ్చిమ.. దక్షిణ భారతాల్లో సుప్రీంకోర్టు బెంచ్ లను ఏర్పాటు చేయాలని పలు లా కమిషన్లు.. న్యాయశాఖ స్టాండింగ్ కమిటీలు సిఫార్సు చేయటాన్ని ప్రస్తావించిన తీరు చూస్తే.. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో సుప్రీంకోర్టు బెంచ్ ఒకటి ఏర్పాటు చేయాలన్న వాదనను తెరపైకి తెచ్చేటట్లుగా కనిపిస్తోంది. ఇవాల్టి ప్రస్తావన.. భవిష్యత్తు ఉద్యమ నినాదంగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News