అరెస్టులపై సుప్రీంకోర్టు షాకింగ్ నిర్ణయం

Update: 2021-08-21 10:30 GMT
అధికారం ఉంది కదాని ఎవరిని పడితే వాళ్ళని పోలీసులు ఇకనుండి అరెస్టు చేయడానికి కుదరదు. దర్యాప్తుకు సహకరిస్తున్నపుడు పోలీసులు అరెస్టు చేయాల్సిన అవసరం లేదని తాజాగా ఓ కేసు సందర్భంగా సుప్రింకోర్టు స్పష్టంగా ఆదేశాలిచ్చింది. ఏదైనా కేసు విషయంలో వ్యక్తులు దర్యాప్తుకు సహకరించకుండా తప్పించుకుంటారన్న అనుమానం వచ్చినప్పుడు మాత్రమే అరెస్టు చేయాలని గట్టిగా చెప్పింది.

సుప్రీంకోర్టు ఆదేశాలు యావత్ దేశానికి వర్తిస్తాయన్న విషయం తెలిసిందే. కాకపోతే మనం మన రాష్ట్రానికి పరిమితమవుదాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రెండేళ్ళలో వివిధ కేసుల్లో కొందరు టీడీపీ నేతలను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అవినీతి కేసులో అచ్చెన్నాయుడు, హత్య కేసులో కొల్ల రవీంద్రను, అక్రమాలకు పాల్పడిన కేసులో దూళిపాళ నరేంద్ర, కొండపల్లి లో అక్రమ మైనింగ్ ఆరోపణల గొడవలో దేవినేని ఉమామహేశ్వరరావును అరెస్టు చేశారు.

ఇదే సమయంలో వేర్వేరు కేసుల్లో మరికొందరికి నోటీసులు కూడా ఇచ్చారు పోలీసులు. సోషల్ మీడియాలో సీఎంను, ప్రభుత్వాన్ని ఉద్దేశ్యపూర్వకంగానే దూషిస్తున్నారనే ఆరోపణలపైన కూడా చాలామందికి నోటీసులిచ్చారు. అయితే విచారణకు హాజరైన వారిని విచారించి వార్నింగులిచ్చి వదిలిపెట్టిన ఘటనలు కూడా ఉన్నాయి. ఏదేమైనా ముందు ముందు పోలీసులు టీడీపీ నేతలను అరెస్టు చేయడం అంత ఈజీ కాకపోవచ్చు.

విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని వెళ్ళినప్పుడు మాత్రమే అరెస్టు చేయాల్సి ఉంటుంది. మార్ఫింగ్ వీడియోతో జగన్ మీద ఆరోపణలు చేసిన కేసులో విచారణకు రమ్మంటే దేవినేని విచారణకు హాజరుకాకుండా తప్పించుకున్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో టీడీపీ హయాంలో కూడా చాలామంది వైసీపీ ఎంఎల్ఏలు, నేతలను ఇపుడు చేస్తున్నట్లే పోలీసులు అరెస్టులు చేసిన విషయం తెలిసిందే. కక్షా రాజకీయాలు పెరిగిపోతున్న నేపధ్యంలో ఇప్పటికైనా సుప్రింకోర్టు స్పందించటం మంచి పరిణామమనే చెప్పాలి.


Tags:    

Similar News