దివాలా తీసిన శ్రీలంక

Update: 2022-05-21 05:30 GMT
ఆర్ధిక, రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయి నానా అవస్తలు పడుతున్న శ్రీలంకలో ఒక లాంఛనం పూర్తయిపోయింది. మొన్న బుధవారం నాటికి దేశం చెల్లించాల్సిన 78 మిలియన్ డాలర్ల అప్పును చెల్లించలేక చేతులెత్తేసింది. 78 మిలియన్ డాలర్ల అప్పును శ్రీలంక ప్రభుత్వం అధికారికంగా ఎగ్గొట్టిందని రెండు అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు ధృవీకరించాయి. శ్రీలంక రిజర్వ్ బ్యాంకు గవర్నర్ నందలాల్ మాట్లాడుతు తమదేశం ముందస్తు దివాలాలో ఉందని ప్రకటించారు.

ఒకవైపు అంతర్జాతీయ  క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు దివాలాను ధృవీకరించటం ఇదే సమయంలో దేశ గవర్నర్ కూడా దివాలాను కన్ఫర్మ్ చేస్తు ప్రకటనచేయటం గమనార్హం.

రుణాలు ఇచ్చిన దేశాలు, ఆర్ధికసంస్ధలు తమ అప్పులను పునరవ్యవస్ధీకరించేవరకు తాము ఎలాంటి చెల్లింపులు చేయలేమని నందలాల్ స్పష్టంగా ప్రకటించేశారు. దాదాపు రెండునెలలుగా శ్రీలంకలో పూర్తి అస్ధిరత నెలకొనుండటం యావత్ ప్రపంచం చూస్తోంది. పెట్రోలు, డీజల్, గ్యాస్ ఏదికూడా జనాలకు దొరకటంలేదు.

పాలపొడి 1.5 కేజీ ప్యాకెట్ రు. 1500పై మాటే. గ్యాస్ ధర రు. 6 వేలు పెట్టినా దొరకటంలేదు. పెట్రోల్, డీజల్ స్టాక్ వచ్చి దేశం సముద్రం రేవులో వెయిట్ చేస్తోంది. అయితే ఆ స్టాక్ ను దింపుకునేందుకు చెల్లించాల్సిన డబ్బు కూడా ప్రభుత్వం దగ్గరలేదు. కూరగాయలు, ఆకుకూరలు కొనటాన్ని మామూలు జనాలు ఎప్పుడో మానేశారు. ఇలాంటి నేపధ్యంలోనే దేశం అధికారికంగా దివాలాను ప్రకటించేసింది.

దేశాన్ని ఆర్ధిక సమస్యలనుండి బయటపడేసేందుకు ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్యనిధితో చర్చలు జరుపుతోంది. బెయిల్ అవుట్ ప్యాకేజీపైన సీరియస్ గా కసరత్తు చేస్తున్నట్లు నందలాల్ చెప్పారు. సంప్రదింపుల ప్రక్రియ మంగళవారానికి పూర్తయ్యే అవకాశముందని అనుకుంటున్నారు. ప్రభుత్వాన్ని నడపాలంటే ఈ ఏడాదికి 4 బిలియన్ డాలర్లు అవసరమని రిజర్వ్ బ్యాంకు లెక్కలుకట్టింది.

50 మిలియన్ డాలర్ల అప్పు తీర్చటానికి అప్పులను పునర్ వ్యవస్ధీకరించాలని అప్పులిచ్చిన దేశాలు, ఆర్ధిక సంస్ధలను శ్రీలంక ప్రభుత్వం కోరింది. కరోనా కారణంగా టూరిజం పూర్తిగా దెబ్బతినేసిందని, విదేశీమారకద్రవ్యం నిల్వలు పడిపోవటంతో సమస్య ముదిరిపోయిందని ప్రభుత్వం ప్రకటించింది.
Tags:    

Similar News