దేశంలో కరోనా బీభత్సం .. ఆ పిటిషన్ పై కేంద్రం స్పందించాలన్న సుప్రీం

Update: 2021-11-27 05:28 GMT
దేశంలో కరోనా మహమ్మారి సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. రెండు సార్లు దేశంలో లాక్ డౌన్ ను కూడా అమలు చేశారు. ఇప్పుడిప్పుడే అంతా కంట్రోల్ లోకి వస్తుంది అనుకుంటున్న సమయంలోనే మరోసారి కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చి అందరిని భయపెడుతోంది.

ఇక ఇదిలా ఉంటే కరోనా దెబ్బకి ఎన్నో కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయి. కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా ప్రభావితమైన కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు జాతీయ ప్రణాళికను సిద్ధం చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రం అదేవిధంగా అన్ని రాష్ట్రాల ప్రతిస్పందనను కోరింది.

జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం సుధీర్ కథ్‌పాలియా దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు విద్యా రుసుము మాఫీ చేయాలని పిటిషన్‌ లో కోరారు.

పిటిషనర్ తరఫు న్యాయవాది రాజేష్ కుమార్ చౌరాసియా, కోవిడ్ కారణంగా అనాథలైన పిల్లలు లేదా ప్రాణాంతక వైరస్ కారణంగా సంపాదించే సభ్యులు మరణించిన కుటుంబాల బాధలను తగ్గించడానికి ఎటువంటి పథకం లేదని పేర్కొన్నారు. ఆరు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసులు జారీ చేస్తున్నామని సుప్రీం కోర్టు తెలిపింది.

ఇక తల్లిదండ్రుల అకాల మరణం కారణంగా పిల్లలు అనాథలుగా మారుతున్నట్లు నివేదికలు ఉన్నాయి. కుటుంబాల కష్టాలను తగ్గించడానికి, అనాథ పిల్లల మొత్తం సంక్షేమం కోసం రాష్ట్రాలు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలి అని పిటిషన్‌ లో పొందుపరిచింది.

ఇక ,గతంలో, గుజరాత్‌లో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నష్టపరిహారం పొందడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలించింది. బాధితులకు త్వరగా పరిహారం చెల్లించాలని ఆదేశించింది. దీంతో పాటు పరిహారం ఇవ్వడంలో జాప్యం జరిగితే ఆ బాధ్యతను లీగల్ సర్వీస్ అథారిటీకి అప్పగిస్తామని కూడా కోర్టు తెలిపింది. ఈ అంశంపై సొలిసిటర్ జనరల్‌ తో కూర్చొని ప్రక్రియను సులభతరం చేయాలని కూడా కోర్టు పేర్కొంది.

ఇక ప్రస్తుతం ప్రధాని మోదీ అధ్యక్షతన అత్యవసర సమావేశం జరుగుతుంది. ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో మన దేశంలో కరోనా పరిస్థితిపై చర్చించనున్నారు. దీంతో పాటు దక్షిణాఫ్రికాతో పాటు పలు దేశాల్లో నమోదైన సరికొత్త, ప్రమాదకరమైన వేరియంట్ ఒమిక్రాన్ గురించి ప్రధానంగా చర్చించనున్నారు.

ఈ వేరియంట్ పై ఇప్పటికే వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మోదీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఇప్పటి వరకు మన దేశంలో కొత్త వేరియంట్ కేసులు నమోదు కానప్పటికీ, ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలనే దానిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.


Tags:    

Similar News