బీజేపీ కి 'ఆలూ' దెబ్బ తప్పదా ?

Update: 2022-01-31 05:30 GMT
ఒక్కోసారి పైకి చిన్న విషయంగా కనబడేదే ఎన్నికల్లో చాలా పెద్ద తీస్తుంది. నిత్యావసరాల ధరల కారణంగా తల్లకిందులైపోయిన ప్రభుత్వాలున్నాయి. ఇక ఉల్లి ధరల దెబ్బ ఎంత బలంగా తగులుతుందో బీజేపీ కన్నా బాగా తెలిసిన పార్టీ మరోటి లేదు. ఇపుడిదంతా ఎందుకంటే తొందరలో జరగబోయే ఎన్నికల్లో బీజేపీకి ఆలూ దెబ్బ తగలబోతోందట. మహా మహా పార్టీలే బీజేపీని ఏమి చేయలేకపోతున్నపుడు ఒక ఆలూ ఏమి చేస్తుందని అనుకుంటున్నారు.

 ఒకపుడు ఉల్లి ఏమి చేసిందో రేపు ఆలూ కూడా అదే చేయబోతోందట. ఇంతకీ విషయం ఏమిటంటే యూపీలోని కొన్ని ప్రాంతాల్లో ఆలూ ధరలు హఠాత్తుగా పడిపోయాయట. తమకు మద్దతు ధరలను ప్రకటించమంటే యోగి ప్రభుత్వం పట్టించుకోవటం లేదట. యూపీలో ఆలూని పండించే రైతులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. యూపీలోని ఆగ్రా-మధుర నుంచి కాన్పూర్, ఇటావా వరకు వేలాది మంది రైతులు ఆలూ సేద్యం మీదే ఆధారపడున్నారు.

ఇక్కడ ఎంత ఆలూ పండుతుందంటే దేశం మొత్తం మీద పండే ఆలూలో 30 శాతం పై ప్రాంతాల్లోనే పండుతుంది. ఇపుడు ఆలూ కిలో ధర 5 రూపాయలకు పడిపోయిందట. ఆ మధ్య వరకు కిలో ఆలూ 10 రూపాయలుండే ఆలూ ధర ఒక్కసారిగా సగానికి సగం పడిపోయింది. దాంతో రైతులు లబోదిబో మంటున్నా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. దాంతో రైతులంతా యోగి ప్రభుత్వం అంటేనే మండిపోతున్నారు. తమకు ఆలూ పండించటం తప్ప మరేపనీ చేతకాదని రైతులు మొత్తుకుంటున్నారు.

 తమ గోడును ఎంత చెప్పుకున్నా పట్టించుకోని ప్రభుత్వానికి ఓట్లు వేయకూడదని మధుర, ఆగ్రా, కాన్పూర్, ఇటావా ప్రాంతాల్లోని రైతులు గట్టిగా తీర్మానం చూసుకున్నారు. ఇదే విషయాన్ని ప్రచారానికి వస్తున్న బీజేపీ నేతలకు, అభ్యర్థులకు బహిరంగంగానే చెబుతున్నారు. పైగా రాబోయే ఎన్నికల్లో తమ ఓట్లు ఎస్పీకే వేస్తామని కూడా బీజేపీ నేతల మొహం మీదే చెప్పేస్తున్నారట. నిజంగానే రైతులు అన్నంత పని చేస్తే పై ప్రాంతాల్లో కమలం పార్టీకి దెబ్బ తప్పేట్లు లేదు. అందుకనే బీజేపీని ఉల్లే కాదు ఆలూ కూడా దెబ్బకొడుతోందనే అనుకోవాలేమో.

 

    

Tags:    

Similar News