డ్రంకెన్ డ్రైవ్ లో పోలీసులు సీజ్.. ఆగ్రహంతో బైక్ ను తగలబెట్టేశాడు

Update: 2022-01-04 05:06 GMT
అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ మహానగరంలో జరిగే మరణాల్లో అత్యధికం మద్యాన్ని సేవించి వాహనాల్ని నడిపి.. దారుణ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇందులో భాగంగా తాగి వాహనాల్ని నడిపే వారికి షాకిచ్చేలా ప్లాన్ చేశారు హైదరాబాద్ మహానగర పోలీసులు. కొత్త సంవత్సరం చివరి రోజుల్లో పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రోగ్రాంను నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సజ్జాత్ అలీఖాన్ అనే వ్యక్తి బైక్ ను సీజ్ చేశారు నాంపల్లి ట్రాపిక్ పోలీసులు.

ఇదిలా ఉండగా.. పోలీసులు పట్టుకున్న తన బైక్ ను తనకు తిరిగి ఇప్పించాలని కోరారు. దీనికి వారు అంగీకరించలేదు. దీంతో పోలీసుల్ని అదే పనిగా బ్రతిమిలాడసాగాడు. తన బైక్ ను తనకు తిరిగి ఇచ్చేయాలని.. వదిలేయాలని.. ఈ ఒక్కసారికి తనను క్షమించాలని కోరాడు. అయినప్పటికీ పోలీసులు అందుకు నో అని చెప్పటంతో అతడికి ఏం చేయాలో తోచలేదు. సాధారణంగా ఎవరికైనా ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు తొలుత బ్రతిమిలాడటం.. కాసేపటికే కోపానికి పోవటం చూస్తుంటాం. మద్యం మత్తులో ఉన్న సజ్జాత్ కూడా అలానే వ్యవహరించాడు.
Read more!

పోలీసుల్ని ఎంత బ్రతిమిలాడినా తన బైక్ ను తిరిగి ఇవ్వని నేపథ్యంలో అసహనానికి గురైన సజ్జత్.. బైక్ కు నిప్పు పెట్టేశాడు. ఈ పరిణామాన్ని ఏ మాత్రం ఊహించని పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బైక్ కు అంటిన మంటల్ని ఆర్పేశారు. దీనిపై సీరియస్ అయిన పోలీసులు అతనిపై లా అండ్ ఆర్డర్ ను దెబ్బ తీసేలా వ్యవహరించినందుకు సెక్షన్ 70బి కింద న్యూసెన్స్ కేసు నమోదు చేశారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.


Tags:    

Similar News