తెలుగు ప్రజలకు బ్యాడ్ న్యూస్.. మరో 4 రోజులు వర్షమే

Update: 2020-10-18 05:30 GMT
వర్షం పడుతుందంటే ఆ ఉత్సాహమే వేరుగా ఉంటుంది. ఒంటికి.. మనసుకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే వాన.. ఒక స్థాయి వరకే. మోతాదు మించితే వర్షానికి మించిన నరకం మరొకటి ఉండదు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అలాంటి పరిస్థితే నెలకొంది. మొన్నటి వాయుగుండం రెండు తెలుగు రాష్ట్రాల్ని వర్షాలతో ఉతికి ఆరేసి వెళ్లిపోతే.. తాజాగా మరో నాలుగైదు రోజుల పాటు వర్షాలు తప్పవని తేలుస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు.

తాజాగా దక్షిణ కోస్తాంధ్రకు సమీపంలో పశ్చిమ మద్య బంగాళాకాతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లుగా గుర్తించారు. అదే సమయంలో దక్షిణ కోస్తాకు దగ్గర్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి తూర్పు మధ్య ఆరేబియా సముద్రం వరకు అల్పపీడనం.. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం.. ద్రోణి ఏర్పడినట్లుగా శాఖ పేర్కొంది.

ఇవిసరిపోవన్నట్లుగా 19న (అంటే సోమవారం) మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది క్ాస్తా బలపడి రానున్న 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారనుందని చెబుతున్నారు. దీని ప్రభావంతో సోమవారం నుంచి బుధవారం వరకు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని చెబుతున్నారు.  తెలంగాణతో పోలిస్తే.. ఏపీలోని కోస్తా ప్రాంతంపైనే ఎక్కువ ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. ఇక.. హైదరాబాద్ మహానగరానికి వస్తే.. రానున్న నాలుగు రోజుల్లో వాన విడవదని.. మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

తాజాగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 21 వరకు తెలంగాణలోనిపలు ప్రాంతాల్లో ఉరుములు.. మెరుపులతో కూడిన భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరించారు. భారత వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల ఆధారంగా రానున్న 24 గంటల్లోనూ వర్షాలకు అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు.. అధికారులు.. పోలీసులు.. అందరూ అప్రమత్తంగా ఉండాలని.. ప్రాణ.. ఆస్తినష్టం వాటిల్లకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. సో.. ‘నిను వీడని నేను’ అన్నట్లుగా వర్షం తెలుగు ప్రజల్ని వెంటాడటమే కాదు.. వద్దు బాబు.. దండం పెడతానన్నా వదలని వైనం ఇప్పుడు జీర్ణించుకోలేని పరిస్థితి.
Tags:    

Similar News