హైదరాబాద్ లో షాకింగ్ ఘటన.. స్కూటీ పై నుంచి పడి వరదలో కొట్టుకెళ్లాడు

Update: 2020-09-21 05:00 GMT
హైదరాబాద్ మహానగరంలో షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. మూడు రోజుల క్రితం నేరేడ్ మెట్ లోని దీన్ దయాళ్ నగర్ కాలనీకి చెందిన సుమేధ అనే పన్నెండేళ్ల బాలిక సైకిల్ మీద వెళుతూ.. నాలాలో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ విషాదం నుంచి బయట పడకముందే.. మరో దారుణం చోటు చేసుకుంది.

సరూర్ నగర్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు విస్మయానికి గురి చేస్తోంది. గడిచిన వారం రోజులుగా వర్షం విడవకుండా నగర జీవుల్ని వెంటాడుతోంది. రోజు మొత్తంలో ఏదో ఒక టైంలో పడుతున్న వర్షం కారణంగా నగరంలోని రోడ్లు అస్తవ్యస్తం కావటమే కాదు.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాలాలు పొంగుతుంటే.. చాలా చోట్ల వరద నీటితో కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి.

సరూర్ నగర్ సమీపంలోని మినీ ట్యాంక్ బండ్ కు వరద నీరు వెళుతోంది. దాదాపు 35 కాలనీలకు చెందిన వరదనీరు ఇందులో కలుస్తుంది. భారీ వర్షం కురవటంతో తపోవన్ కాలనీ వద్ద వరద నీరు ఎక్కువగా వస్తోంది. అదే సమయంలో స్కూటీ మీద వెళుతున్న వారి వాహనం ఆగింది. పలుమార్లు దాన్ని ఆన్ చేసే ప్రయత్నంలో విఫలమయ్యారు. ఇదిలా ఉండగా.. ఒక్కసారిగా స్కూటీ స్టార్ట్ కావటం.. వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి వేగంగా వెళితే.. స్కూటీ వెనుక కూర్చున్న వ్యక్తి మాత్రం పట్టు తప్పి కిందకు పడిపోయాడు.

కిందకు పడటం.. వరద నీటిలో కొట్టుకెళ్లారు. అక్కడి స్థానికులు ఈ ఉదంతాన్ని గుర్తించి.. రక్షించేందుకు ప్రయత్నించినా.. అప్పటికే వరద నీటి వేగం ఎక్కువగా ఉండటంతో.. చూస్తుండగానే అందులో కొట్టుకెళ్లారు. ఈ ఉదంతం గురించి జీహెచ్ ఎంసీ అధికారులకు స్థానికులు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన డీఆర్ఎఫ్ సిబ్బంది గల్లంతైన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. అయితే.. స్థానికుల కంప్లైంట్ తర్వాత డీఆర్ఎఫ్ సిబ్బంది ఆలస్యంగా రంగంలోకి దిగినట్లుగా చెబుతున్నారు.
Tags:    

Similar News