జూనియర్లకు అలా.. సీనియర్లకు ఇలా...?

Update: 2021-11-04 14:30 GMT
పురుషులందు పుణ్య పురుషులు ఎపుడూ వేరే. అలాగే రాజకీయాల్లో సీనియర్లకు సీనియారిటీకి ఒక విలువ గౌరవం ఉంటుంది. వారిని ఏ పార్టీ అయినా గౌరవించుకోవాల్సి ఉంటుంది. వైసీపీలో చూస్తే సీనియర్లు తమకు తగిన మర్యాద దక్కడంలేదని గుస్సా మీద ఉన్నారు. అలాంటి సీనియర్ల మొరను అధినేత, ముఖ్యమంత్రి అయిన జగన్ కాస్తా సావధానంగా వినదలచుకున్నారుట. వారికి సముచితమైన స్థానాన్నే ఇవ్వాలనుకుంటున్నారుట. అయితే వారు కోరుకుంటున్నట్లు కాదు సుమా జగన్ తాను అనుకుంటున్నట్లు. మరి ఇది సీనియర్లకు అంగీకారమా అంటే కాస్తా ఆలోచించాలి.

ఎక్కడైనా  బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ కాబట్టి జగన్ నిర్ణయమే చివరికి ఫైనల్ అని అదే అమలు అవుతుంది అంటున్నాయి వైసీపీ వర్గాలు. జగన్ తీసుకోబోయే నిర్ణయాలు ఏంటి అంటే ముందుగా మంత్రి వర్గ విస్తరణ. అది నూటికి నూరు శాతమా, లేక తొంబై శాతాన్ని తప్పిస్తారా అన్నది తేలకపోయినా ఇపుడున్న పాతిక మంది మంత్రుల్లో ఇరవై మంది దాకా మాజీలు కావడం పక్కాగా  ఖాయమనే అంటున్నారు. వారి ప్లేస్ లో కొత్తా వారిని జూనియర్లను జగన్ తీసుకుంటారని భోగట్టా.

అదే సమయంలో సీనియర్లను, మంత్రి పదవులు ఆశించిన వారిని పార్టీ పెద్దలుగా చేస్తారు అంటున్నారు. ఒక్కో జిల్లాలో ఉన్న సీనియర్లను ఆయా జిల్లా పెద్దలుగా చేసి పార్టీ పగ్గాలు అప్పగిసారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ మరో మారు గెలవాలి అంటే కచ్చితంగా సీనియర్ల సేవలు అవసరమని జగన్ భావిస్తున్నారుట. అలాగే తన మంత్రివర్గాన్ని యువ రక్తంతో నింపేయాలని ఆరాటపడుతున్నారని టాక్. సరే జగన్ ఆలోచనలు బాగానే ఉన్నాయి కానీ మంత్రి పదవీ పార్టీ పదవీ ఒక్కటేనా అంటే సీనియర్ల నుంచి నో అనే జవాబు వస్తుంది. కానీ జగన్ మాత్రం వారి సేవలు పార్టీకే అని నిర్దేశించాక ఇక వేరే ఆప్షన్ ఉండదేమో. మొత్తానికి డిసెంబర్ నెలలో మంత్రి  వర్గ విస్తరణ ఉంటుందిట. ఆ తరువాత వెంటనే పార్టీ ప్రక్షాళన కూడా ఉంటుందిట. సో వైసీపీలో జరిగే ఈ మార్పులు అన్నీ సజావుగా సాగిపోతాయా లేక ప్రకంపనలు సృష్టిస్తాయా అంటే వేది చూడాల్సిందే.
Tags:    

Similar News