షాకింగ్: జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఇంట్లో సోదాలు

Update: 2020-12-20 04:00 GMT
సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడో ఎదురుకాని అనుభవాన్ని ఎదుర్కొన్నారు జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి.. నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత.. ఎంపీ ఫరూక్ అబ్దుల్లా. విచారణ సంస్థలు ఏవైనా కానీ.. ఆయనపై ఆరోపణలు ఎన్ని వచ్చినా అటు వైపు చూడటానికి కూడా ఇష్టపడని తీరుకు భిన్నంగా తాజాగా ఆయన నివాసంలోనే ఈడీ సోదాలు జరపటం పెను సంచలనంగా మారింది. ఇంతకూ అంతటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అన్న విషయంలోకి వెళితే.. ఆ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ లో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించిన కేసులో రూ.11.86 కోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ జఫ్తు చేసింది.

జమ్ముకశ్మీర్ లో ఉన్న ఈ ఆస్తుల్ని మనీ లాండరింగ్ కేసుల్లో భాగంగా తాత్కాలికంగా జఫ్తు చేసినట్లుగా అధికారులు వెల్లడించారు. ఇందులో రెండు ఇళ్లు.. ఒక వాణిజ్య ఆస్తి.. మూడు ఫ్లాట్లు ఉన్నట్లుగా వారు చెప్పారు. పత్రాల ప్రకారం వీటి విలువ రూ.11.80కోట్లుగా చెప్పారు. మార్కెట్ విలువ రూ.60 నుంచి రూ.70 కోట్ల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు.

జమ్ముకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ లో చోటు చేసుకున్న మనీ లాండరింగ్ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తును పరిగణలోకి తీసుకొని ఈ చర్య తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసు విచారణ షురూ అయ్యింది. ఈ వ్యవహారంలో ఫరూక్ అబ్దుల్లాతో పాటు మరికొందరిపై సీబీఐ అభియోగ పత్రం దాఖలు చేసింది. అయితే.. బెదిరింపు చర్యల్లో భాగంగానే తన తండ్రిపై ఆరోపణలు చేస్తున్నట్లుగా ఫరూక్ తనయుడు.. మాజీ ముఖ్యమంత్రిగావ్యవహరించిన ఒమర్ అబ్దుల్లా అసహనం వ్యక్తం చేశారు.

ఏది ఏమైనా.. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తే.. జమ్ముకశ్మీర్ కే కాదు దేశ వ్యాప్తంగా ఈ వ్యవహారం పెను సంచనలంగా మారిందని చెప్పక తప్పదు. చూస్తుంటే.. జమ్ముకశ్మీర్ విషయంలో గత పాలకులకు భిన్నంగా వ్యవహరించటమే కాదు.. అవినీతి అక్రమాలకు వారు అతీతం కాదన్న విషయాన్ని లెక్కలతో సహా చూపించే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపించక మానదు.
Tags:    

Similar News