చంద్రబాబుని ఏ రేంజిలో ఆడుకుంటున్నారంటే..

Update: 2018-12-23 12:14 GMT
చేసిన మంచి గురించి ఎక్కువ చెప్పుకుంటే ఆ మంచికి విలువే ఉండదంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మాత్రం చేయని పనుల గురించి కూడా డబ్బా కొట్టుకోవడం అలవాటు. ఐతే ఒకప్పుడు ఆయన్ని వ్యతిరేకించే మీడియా ఉండేది కాదు. పైగా అప్పటికి సోషల్ మీడియా ఉనికే లేదు. కాబట్టి ఆయన ఏం మాట్లాడినా.. ఎంత డబ్బా కొట్టుకున్నా నడిచిపోయేది. దాని గురించి ఎవరూ ప్రశ్నించేవాళ్లు కాదు. పెద్దగా డిస్కషన్లు ఉండేవి కావు. కానీ ఇప్పుడు కథ మారింది. చంద్రబాబు గాలి తీయడానికి ప్రత్యామ్నాయ మీడియా ఉంది. వెబ్ మీడియా యాక్టివ్ అయింది. వీటన్నింటికీ మించి ఏ చిన్న తప్పు చేసినా బట్టలు ఊడదీసి నిలబెట్టేసే సోషల్ మీడియా ఉద్ధృతంగా నడుస్తోంది. ఇలాంటి సమయంలో ఎవరు అతి చేసినా కష్టం.

ఐతే బాబు ఇదేమీ గుర్తించకుండా తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటున్నారు. మరీ ఈ మధ్య శ్రుతి మించి మాట్లాడుతున్నారు. గోరంత పని చేసి కొండంత క్రెడిట్ తీసుకునే అలవాటును ఆయన కొనసాగిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో బాబు మీద ట్రోలింగ్ ఓ రేంజిలో నడుస్తోంది. సెల్ ఫోన్లు రావడానికి కూడా నేనే కారణం.. అంటూ ఈ మధ్య ఆయన చేసిన కామెంట్ మీద ఏ స్థాయిలో ట్రోలింగ్ జరిగిందో తెలిసిందే. అలాగే ఇటీవలి ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోవడానికి తెలుగుదేశం పార్టీ కూడా ఒక కారణమే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు బాబు. ఇక సోషల్ మీడియా జనాలు ఊరుకుంటారా? ఆయన్ని ఓ రేంజిలో ఆడేసుకున్నారు. ఈ నేపథ్యంలో బాబు మీద మీమ్స్ పెద్ద ఎత్తున పుట్టుకొస్తున్నాయి. డుమువులు ప్రథమా విభక్తి.. అంటూ మొదలుపెట్టి విభక్తులన్నీ చెప్పి.. చివరగా ‘అంతా నేనే చేశాను.. అంతా నా వల్లే.. ఇది నారా విభక్తి’ అనే వరకు వచ్చింది వ్యవహారం. తాజాగా చంద్రబాబు శ్రీనివాస రామానుజంకు జన్మదిన శుభాకాంక్షలు చెబితే.. ఒక నెటిజన్ దానికి బదులుగా ‘కొంపదీసి ఆయనకు మ్యాథ్స్ కూడా మీరే నేర్పించారా’ అంటూ కామెంట్ పెట్టాడు. దీన్ని బట్టే చంద్రబాబు మీద జనాలకు ఎలాంటి అభిప్రాయాలున్నాయో.. ఆయన్ని నెటిజన్లు ఏ రేంజిలో ఆడుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు.

Tags:    

Similar News