ఢిల్లీ యువ‌తి ఘ‌ట‌న‌: అస‌లు మ‌ర్మం వేరే ఉంది

Update: 2015-08-27 07:53 GMT
ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన విద్యార్ధిని జస్లీన్‌ కౌర్ ప‌ట్ల ఓ యువ‌కుడి అస‌భ్యక‌ర ప్ర‌వ‌ర్త‌న‌ ఘ‌ట‌న‌పై కొత్త అంశాలు వెలుగులోకి వ‌చ్చాయి. జ‌స్లీన్ కౌర్ క‌థ‌నం ప్ర‌కారం... ఆమె తిలక్‌ నగర్‌ లో రోడ్డు దాటుతోంది. ఇంతలో రాయల్‌ ఎన్‌ ఫీల్డ్‌ పై స్పీడ్‌ గా దూసుకొచ్చిన సరవ్‌ జిత్‌ సింగ్‌ కౌర్‌ ను ఢీ కొట్టేంత పని చేశాడు. దీంతో అవాక్కైన కౌర్‌... సరవ్‌ జిత్‌ సింగ్‌ ను ప్రశ్నించింది. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించవా.. అంటూ నిలదీసింది. దీంతో కోపోద్రోక్తుడైన సరవ్‌ జిత్‌.. ఆమెను దూషించాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. అంతేగాక  ఆ తర్వాత ఆమెను వెంబడించడం మొదలుపెట్టాడు. బైక్‌ పై వెళ్తూ అసభ్యకరంగా మాట్లాడాడు. లిఫ్ట్‌ ఇస్తాను.. వస్తావా.. అంటూ కామెంట్స్‌ చేశాడు. ఇదంతా ఓపికగా భరించిన కౌర్.. తెలివిగా ఈ తతంగాన్ని తన స్మార్ట్‌ ఫోన్‌ లో బంధించింది.

రోడ్ లపై బైక్స్‌ పై వెళ్తూ ఈవ్‌ టీజింగ్‌ చేసేవాళ్లకు బుద్ది చెప్పాలని.. ఆ ఫొటోను ఫేస్‌ బుక్‌ లోనూ పోస్ట్‌ చేసింది. ఆమెకు మద్దతు తెలుపుతూ 63 వేలకు పైగా లైక్స్‌ వచ్చాయి. తనను వేధిస్తున్న ఫొటోను పోలీసులకు పంపింది. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ధైర్యం ప్రదర్శించడమే కాకుండా... వేధింపులను ఫోన్‌ లో బంధించిన కౌర్‌ ను బ్రేవ్‌ గర్ల్‌ అంటూ పోలీసులు మెచ్చుకున్నారు. అంతేగాక ఆమెకు ఐదు వేల రూపాయలు నజరానా ప్రకటించారు. ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రివాల్ కూడా అభినందించారు.

ఈ కేసులో క‌ట‌క‌టాల పాలై బెయిల్‌ పై బ‌య‌ట‌కు వ‌చ్చిన స‌ర‌వ్‌ జీత్ సింగ్ కొత్త విష‌యాలు చెప్పారు. ఆప్ కార్య‌క‌ర్త అయిన కౌర్ ప‌బ్లిసిటీ కోసమే ఇదంతా చేసింద‌ని మండిప‌డ్డారు. ఆప్‌ తో ఉన్న సంబంధాల‌ను దుర్వినియోగం చేసేలా ఆమె వ్య‌వ‌హ‌రించింద‌ని మండిప‌డ్డారు. మ‌రోవైపు ఇందుకు త‌గ్గ‌ట్లు ఆధారాలు కూడా ఓ చాన‌ల్ వెలువ‌రించింది. సంఘ‌ట‌న స్థ‌లంలో ఉన్న ఓ సీనియ‌ర్ సిటిజ‌న్ ఘ‌ట‌న తాలుకు వివ‌రాల‌ను వెల్ల‌డించారు. కౌర్ చేసిన‌ట్లు అక్క‌డ ఆమెను ఇబ్బంది పెట్ట‌లేద‌ని, కావాల‌నే ఈ విధంగా చేసింద‌ని వివ‌రించారు. ట్రాఫిక్ సిగ్న‌ల్ వ‌ద్ద బైకు ఆపాల‌ని కౌర్ కోరింద‌ని, అందుకు అంగీక‌రించ‌నందుకే ఈ విధంగా చేసింద‌ని తెలిపారు.

మొత్తంగా యువ‌తి ధైర్య‌సాహ‌సాల ఎపిసోడ్ కొత్త అంకం భ‌య‌ట‌ప‌డటం ఆస‌క్తిక‌ర‌మే.
Tags:    

Similar News