అంతరిక్షంలో 'డ్రాగన్' అద్భుత ప్రయాణం..!

Update: 2022-12-06 02:30 GMT
అంతరిక్ష ప్రయోగాల్లో అమెరికాకు ధీటుగా డ్రాగన్ కంట్రీ దూసుకెళుతోంది. నాసా ప్రయోగాలను తలదన్నేలా చైనా అద్భుతమైన అంతరిక్ష ప్రయోగాలు చేపడుతూ ఔరా అనిపిస్తుంది. గత కొన్నేళ్లుగా  అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ ను నిర్మిస్తున్న చైనా ఆ పనులను మరింత వేగవంతంగా చేసింది.

ఈ క్రమంలోనే ఈ ఏడాది జూన్ 5న షెంఝౌ-14 వ్యోమ నౌక ద్వారా ముగ్గురు వ్యోమగాములను రోదసిలోకి పంపించింది. సుమారు ఆరు నెలల పాటు వీరంతా అంతరిక్షంలో తమ విధులను నిర్వర్తించారు. 183 రోజుల పాటు రోదసీలో గడిపిన ఈ ముగ్గురు వ్యోమగాములు తాజాగా భూమికి  చేరుకొని చరిత్ర సృష్టించారు.

షెంఝౌ 14 వ్యోమనౌక ద్వారా మంగోలియాలోని డాంగ్ ఫెండ్ ప్రాంతంలో ముగ్గురు వ్యోమగాములు సేఫ్ గా ల్యాండ్ అయ్యారు.

దీంతో వీరి రోదసీ యాత్ర పూర్తయింది.  అయితే అంతరిక్షం నుంచి తిరిగి వచ్చే క్రమంలో ఐదు వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియ.. మూడు స్పేస్ వాక్ లను వ్యోమగాములు నిర్వహించారు.

ఈ ప్రక్రియలో భాగంగా అంతరిక్ష కేంద్రం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా సైన్స్ పై వ్యోమగాములు ఉపన్యాసం ఇచ్చారు. దీంతోపాటు అనేక సాంకేతిక ప్రయోగాలు నిర్వహించారు. వీరిని భూమిపై రావడానికి ముందే వీరి స్థానంలో చైనా మరో ముగ్గురిని అంతరిక్షంలోకి పంపించడంలో విజయవంతమైంది.

వీరంతా గత నెల 20న షెంఝౌ-15 వ్యోమనౌక ద్వారా రోదసీలోకి వెళ్లారు. ఈ ముగ్గురు వ్యోమగాములు సుదీర్ఘకాలం పాటు అంతరిక్షంలో జీవించడం ఎలా అనే అంశాలపై ప్రయోగాలు నిర్వహించనున్నారు. మరోవైపు ఈ నెలఖారు వరకు చైనా తన స్పేస్ స్టేషన్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ మేరకు చైనా అంతరిక్ష ప్రయోగాల్లో దూకుడు పెంచింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News