సదానందగౌడ ఇప్పుడక్కడ రియల్ హీరో

Update: 2016-07-03 04:35 GMT
మానవత్వం అన్నది రోజురోజుకి కనిపించని పదార్థంలా మారిపోతున్న రోజులివి. కళ్ల ముందు జరిగే ఘోరాన్ని ప్రశ్నించటం మర్చిపోయి చాలా కాలమే అయ్యింది. అనుకోని ప్రమాదం జరిగినా.. స్పందించి సాయం అందించేందుకు ముందుకు రాని రోజులివి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రమంత్రి సదానంద గౌడ తనలోని మానవత్వాన్ని చాటటమే కాదు.. ఇప్పుడు రియల్ హీరో అనిపించుకుంటున్న పరిస్థితి.

బెంగళూరు మహానగరంలో చోటు చేసుకున్న ఈ ఉదంతం తెలిసిన వారంతా కేంద్రమంత్రి సదానందగౌడ ప్రదర్శించిన మానవత్వానికి ముగ్ధులు కావటమే కాదు.. ఆయనకు అభిమానులుగా మారిపోతున్నారు. ఇంతకూ ఆయనేం చేశారన్న విషయంలోకి వెళితే.. బెంగళూరులోని ఆర్ టీ నగర ప్రాంతంలో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. టూవీలర్ మీద వెళుతున్న ఒక యువకుడు ప్రమాదవశాత్తు రోడ్డు మలుపు వద్ద జారి పడిపోయాడు. నెత్తురోడుతున్న అతన్ని.. అటువైపుగా వెళుతున్న కేంద్రమంత్రి సదానంద గౌడ గుర్తించి.. వెంటనే కారు ఆపి తనతో తీసుకెళ్లి.. ఆసుపత్రిలో చేర్పించారు.

ప్రమాదం జరిగిన వెంటనే కేంద్రమంత్రి చురుగ్గా వ్యవహరించి.. ఆసుపత్రికి చేర్చటంతో అతనికి ప్రాణాపాయం తప్పిందని చెబుతున్నారు. మానవత్వం ఉన్న మనిషిలా వ్యవహరించిన ఒకరి ప్రాణాన్ని కాపాడిన కేంద్రమంత్రిని ఇప్పుడందరూ అభినందిస్తున్నారు. అందరి అభినందనలకు సదానంద గౌడ అర్హుడే.
Tags:    

Similar News