రోజా.. జాబ్ మేళా.. కాన్సెప్ట్ అదిరిపోయిందిగా

Update: 2017-11-14 07:04 GMT
ఏపీ సీఎం చంద్ర‌బాబుకు వైసీపీ అధిరిపోయే షాక్ ఇచ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అసెంబ్లీలో విప‌క్ష వైసీపీ పాత్ర కూడా తామే పోషిస్తున్న‌ట్టు చెప్పుకొస్తున్నారు. అయితే, దీనికి రివ‌ర్స్‌ లో వైసీపీ ఇప్పుడు అధికార పాత్ర పోషిస్తోంది. ఈ ప‌రిణామంతో ఒక్క‌సారిగా బాబు బృందం షేక్ అయింద‌ని స‌మాచారం. విష‌యంలోకి వెళ్తే.. వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా.. అధికార ప‌క్షం టీడీపీ - సీఎం చంద్ర‌బాబుల‌పై విరుచుకుప‌డ‌డం వ‌ర‌కే మ‌న‌కు తెలిసిన కోణం. ప్ర‌భుత్వం చేస్తున్న అవినీతి - మ‌హిళ‌ల‌పై జ‌ర‌గుతున్న దాడులు - అసెంబ్లీలో వైసీపీ నేత‌ల నోళ్లు నొక్క‌డం వంటి కీల‌క అంశాల‌పై రోజా ఏ రేంజ్‌ లో పోరాటం చేసిందో అంద‌రికీ తెలిసిందే. అంతేకాదు - విజ‌య‌వాడ‌ను కుదిపేసిన కాల్ మ‌నీ వ్య‌వ‌హారంపై అసెంబ్లీలో ప్ర‌శ్న‌లు సంధించి.. ఏడాది పాటు స‌స్పెండ్ అయింది కూడా. అయినా త‌న పోరాటం ఆప‌లేదు. ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వం ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై తీవ్ర స్థాయిలో పోరు చేసిన రోజా.. తానేంటో.. త‌న స‌త్తా ఏంటో నిరూపించుకునేందుకు రంగంలోకి దిగింది.

నిజానికి సినీ ఫీల్డ్ నుంచి వ‌చ్చి రాజ‌కీయాల్లో రాణించిన మ‌హిళ‌లు చాలా అరుదు. కానీ, రోజా మాత్రం ఇప్ప‌టికీ సినీ ఫీల్డ్‌ - బుల్లి తెర వంటి వాటిపై ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూనే.. రాజ‌కీయంగా చంద్ర‌బాబుకు కంట్లో న‌లుసుగా మారింది. రోజాను ఎదుర్కొనేందుకు ఇప్పుడు పార్టీలో ఉన్న మ‌హిళా నేత‌లు ఎవ‌రూ ప‌నికి రాక‌పోవ‌డంతో బాబు ఏకంగా మాజీ హీరోయిన్ వాణీ విశ్వ‌నాథ్‌ ను రంగంలోకి దింపుతున్నారు. ఇక‌, తాజాగా రోజా త‌న నియోజ‌క‌వ‌ర్గం న‌గ‌రిలో ప్ర‌త్యేకంగా నిరుద్యోగుల‌పై దృష్టి పెట్టారు. బాబు వ‌స్తే.. జాబు వ‌స్తుంద‌ని భావించినా ఏ ఒక్క‌రికీ ఉద్యోగాలు ఇవ్వ‌లేద‌ని నిన్న మొన్న‌టి వ‌ర‌కు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించిన రోజా.. ఏ అధికార‌మూ లేక‌పోయినా.. తాను నిరుద్యోగుల‌కు ఉపాధి చూపిస్తానంటూ న‌డుం బిగించారు.

ఈ క్ర‌మంలోనే ఆమె ఈ శుక్ర‌వారం అంటే ఈ నెల‌ 17 వ తారీఖున న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో భారీ ఉద్యోగ మేళా నిర్వ‌హిస్తున్నారు. న‌వంబ‌రు 17 రోజా పుట్టిన రోజు కావ‌డంతో ఆ రోజున త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని నిరుద్యోగుల‌కు ఉపాధి క‌ల్పించాల‌ని - ఉద్యోగాలు ఇవ్వాల‌ని రోజా డిసైడ్ అయ్యారు. ఈ క్ర‌మంలోనే ఆమె మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారు. రోజా నిర్వహించనున్న ఈ ఉద్యోగ మేళాకు దాదాపు 40 కంపెనీలు హాజరవుతున్నాయి. ఈ నెల 17వ తేదీన పుత్తూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఈ మేళా జరగనుంది. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మెగా జాబ్ మేళా కొనసాగుతుంది.

ఉద్యోగార్థులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రోజా - వైసీపీ నాయకులు కోరుతున్నారు. ఉద్యోగం కోసం వచ్చే వారంతా తమ వెంట తమ ఆధార్ కార్డులు తెచ్చుకోవాలని కూడా చెప్పారు. పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన వారు జాబ్ మేళాకు హాజరు కావొచ్చు. రోజా ఇప్పటికే 'హలో యూత్... చలో జాబ్' మెగా ఉద్యోగ మేళా పోస్టర్‌ ను విడుదల చేశారు. మొత్తానికి బాబుకు రోజా మంచి ట్విస్ట్ ఇచ్చార‌ని అంటున్నారు నెటిజ‌న్లు!
Tags:    

Similar News