రోజాకు సంతోషమొచ్చినా తిడుతుందట..

Update: 2015-10-13 06:56 GMT
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి చిన్న మెదడు పూర్తిగా చితికిపోయిందని... అందుకే ఆయన అత్యంత అప్రజాస్వామికంగా జగన్ దీక్షను భగ్నం చేశారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. చైనా - జపాన్ అంటున్న చంద్రబాబు రాష్ట్ర ప్రజల అవసరాలను మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ ఆమె మండిపడ్డారు. భజనపరులను వెంటేసుకుని ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ.... రాష్ట్రాన్ని దోచి సింగపూర్‌ కో మలేసియాకో అమ్మేద్దామని ప్లాన్లేస్తున్నారని.... అంతేకానీ, ఆయనకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ధ్యాసే లేదని ఆమె ఆరోపించారు. దీక్ష భగ్నం చేసినంతమాత్రాన తమ పోరాటాన్ని ఆపలేరని హెచ్చరించారు.  

ప్రత్యేక హోదా కోసం వైయస్ జగన్ చేపట్టిన దీక్షపై మంత్రులు, ముఖ్యమంత్రి  ఎగతాళిగా మాట్లాడుతున్నారని కూడా రోజా ఆరోపించారు. నిన్నటి వరకు అసలు దీక్షను పట్టించుకోనట్లుగా వ్యవహరించి ఒక్కసారిగా దొంగ దారిన దీక్షను భగ్నం చేశారని... మంచి పని కోసం దీక్ష చేస్తుంటే కనీసం మంత్రులను పంపి చర్చలు జరిపించి, ప్రత్యేక హోదా తెప్పిస్తామనే హామీ కూడా ఇవ్వకుండా భగ్నం చేయడం అప్రజాస్వామ్యం తప్ప ఇంకేమీ కాదని ఆమె ఆరోపించారు.  ఇక్కడితో తమ పోరాటాన్ని ఆపేస్తామనుకుంటే అది వాళ్ల భ్రమ అని, టిడిపి ప్రభుత్వంపై తమ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పారు.

జగన్ తన పరిశ్రమలు పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలని ఏమీ అడగలేదని, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించాలనే ఏకైక ధ్యేయంతో దీక్ష చేస్తుంటే దానిపై ప్రజల్లో అపోహలు కల్పించే విధంగా ఎలా చేశారో చూశామని ఆమె అన్నారు.  కామినేని శ్రీనివాస్ వంటి పనికిమాలిన వాళ్లను మంత్రులుగా పెడితే వాళ్లు తప్పుడు నివేదికలతో తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

మొత్తానికి దీక్ష అనుకున్నంత సక్సెస్ కాకపోవడం.. తొలుత గవర్నమెంటు పట్టించుకోకపోవడంతో ఇరుకునపడ్డ జగన్, వైసీపీ కూడా ఎంతవేగంగా ముగిస్తే అంత బాగుణ్నని అనుకున్న తరుణంలో గవర్నమెంటు దీక్షను భగ్నం చేయడంతో ఆ పార్టీలో లోలోన సంతోషిస్తోంది. అయితే.. బయటకు మాత్రం ఇలా కబుర్లు చెబుతోందన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.

...నిజానికి మంగళవారం వైసీపీ సీనియర్లు చర్చించుకుని ఏదో చేసి దీక్షను ముగించాలని అనుకున్నారు. సోమవారం బొత్స సత్యనారాయణ కూడా అదే విషయం చెప్పారు. అయితే ఈ లోగానే గవర్నమెంటు జోక్యం చేసుకుని దీక్ష భగ్నం చేసింది. దీంతో వైసీపీ నేతలు, జగన్ అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి సమయంలో రోజా మాత్రం సినిమా డైలాగులు కొడుతూ గగ్గోలు పెట్టడం విచిత్రమే. దీంతో ఆమె తమ నాయకుడిని బతికించారన్న సంతోషంలో చంద్రబాబును తిడుతోందని టీడీపీ నాయకులు అంటున్నారు.
Tags:    

Similar News