బీమా పూర్తిగా ప్రైవేటు పరం!.. మంచా? చెడా?!
అయితే.. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని కూడా మార్పు చేయనుంది. ``అందరికీ బీమా-అందరికీ రక్షణ`-2025 చట్టాన్ని తీసుకురానుంది.;
బీమా(ఇన్సూరెన్స్).. ఇది వ్యక్తిగతంగానే కాకుండా.. కుటుంబాలకు కూడా మేలు చేసే ఆర్థిక భరోసా. ఒకప్పుడు అంటే.. ఓ 50 ఏళ్ల కిందకు వెళ్తే వ్యక్తి ప్రాణానికి, వాహనాలకు మాత్రమే పరిమితంఅయిన బీమా రంగం.. ఇప్పుడు `కాదేదీ బీమాకు అనర్హం`అన్నట్టుగా అన్ని రంగాల్లోకి వచ్చేసింది. వాహనాలతోపాటు.. వాటి విడి భాగాలకు కూడా బీమా చేయిస్తున్నారు. ఆరోగ్య బీమాతోపాటు.. `అందమైన` బీమాలు కూడా ఉన్నాయి. సొ.. మొత్తంగా.. బీమా వ్యవస్థ రూపు రేఖలు మారినా.. ప్రజలకు చేరువగానే ఉందని చెప్పాలి.
బ్రిటీష్ కాలంలోనే బీమా కోసం చట్టం చేశారు. 1938లో తీసుకువచ్చిన ఇన్సూరెన్స్ యాక్ట్.. దాదాపు 20 ఏళ్లపాటు ప్రజలకు అందుబాటులో ఉంది. ఆ తర్వాత.. 1956లో పలు మార్పులు చేసి.. దీనిని కార్పొరేష న్‌గా ఏర్పాటు చేశారు. 1956 నుంచి దీనిని కార్పొరేషన్ యాక్టు పరిధిలోకి తీసుకువచ్చారు. ఇక, 1999లోనూ ఈ చట్టానికి ఒకసారి సవరణ చేశారు. అప్పట్లో ఇన్‌స్యూరెన్స్ రెగ్యులేటరీ అధారిటీ చట్టం తీసుకువచ్చా రు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఈ చట్టమే అమల్లో ఉంది.
అయితే.. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని కూడా మార్పు చేయనుంది. ``అందరికీ బీమా-అందరికీ రక్షణ`-2025 చట్టాన్ని తీసుకురానుంది. దీనికి సంబంధించిన కసరత్తు కూడా పూర్తయింది. సోమవారం పార్లమెంటులో ఈ బిల్లుకు సంబంధించిన ప్రతులను పార్లమెంటు సభ్యలకు పంచారు. అనంతరం.. మరో రెండు రోజుల్లోనే దీనిని ఆమోదించనున్నారు. తద్వారా మోడీ హయాంలో తీసుకువచ్చిన అతి పెద్ద సంస్కరణగా ఇది మారనుంది.
ఏం జరుగుతుంది?
+ భారత బీమా రంగంలో దిగ్గజంగా ఉన్న ఎల్ ఐసీకి మరింత పోటీ పెరగనుంది.
+ విదేశీ సంస్థలు పూర్తిగా ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు.. అవకాశం ఏర్పడుతుంది.
+ ప్రస్తుతం బీమా రంగంలో 74 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఉన్నాయి.
+ ఇక నుంచి ఇవి 100 శాతంగా ఉంటాయి.
+ దీనివల్ల విదేశాలకు చెందిన బీమా సంస్థలకు.. భారత్‌లో మంచి గిరాకీ పెరగనుంది.
+ అయితే.. క్లెయిముల విషయంలో సర్కారు పూచీ పడకపోతే.. ఇబ్బందులు తప్పవు.
+ ఇప్పటికే ప్రైవేటు బీమా సంస్థలు పరిహారం విషయంలో డోలాయమానంలో ఉన్నాయి.
+ రిలయన్స్ బీమా పిల్లి మొగ్గలు వేయడం తెలిసిందే.
+ ఆదిత్య బిర్లా బీమా కంపెనీ కూడా నష్టాల్లోనే ఉంది.
+ అయితే. అన్నీ అలా జరగాలని లేదు. కాబట్టి.. వేచి చూడాల్సిందే. అంతిమంగా ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకోకుండా ఉంటే చాలన్నది ప్రతిపక్షం మాట.