మెస్సీ స్వ‌దేశానికి.. టూర్ ఆర్గ‌నైజ‌ర్ పోలీస్ క‌స్ట‌డీకి

ప్ర‌పంచ ఫుట్ బాల్ దిగ్గ‌జం ల‌యోన‌ల్ మెస్సీ భార‌త ప‌ర్య‌ట‌న దాదాపు ముగింపున‌కు వ‌చ్చింది.. మ‌రికొద్దిసేప‌ట్లో అత‌డు స్వ‌దేశం వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాడు.;

Update: 2025-12-15 11:35 GMT

ప్ర‌పంచ ఫుట్ బాల్ దిగ్గ‌జం ల‌యోన‌ల్ మెస్సీ భార‌త ప‌ర్య‌ట‌న దాదాపు ముగింపున‌కు వ‌చ్చింది.. మ‌రికొద్దిసేప‌ట్లో అత‌డు స్వ‌దేశం వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాడు. దేశం న‌లుమూల‌లా ఉన్న నాలుగు ప్ర‌ధాన న‌గ‌రాల‌ను (కోల్ క‌తా, హైద‌రాబాద్, ముంబై, ఢిల్లీ) చుట్టేసి.. త‌న‌ప‌ట్ల అద్భుత‌మైన అభిమానాన్ని క‌న‌బ‌ర్చిన భార‌తీయుల ప్రేమ‌ను గుండెల్లో దాచుకుంటూ.. మెస్సీ తిరిగి వెళ్లిపోనున్నాడు. కానీ, అత‌డిని భార‌త్ కు తీసుకొచ్చిన ఈవెంట్ మేనేజ‌ర్ మాత్రం పోలీస్ క‌స్ట‌డీకి వెళ్ల‌నున్నాడు. ప్ర‌పంచ విజేత జ‌ట్టు అయిన అర్జెంటీనా సార‌థిగా.. ప్ర‌పంచ ఫుట్ బాల్ లో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (గోట్)గా పేరున్న మెస్సీని భార‌త్ కు ర‌ప్పించ‌డ‌మే గొప్ప‌. 2011లోనే ఓసారి మెస్సీ భార‌త్ వ‌చ్చినా, అప్పుడు అత‌డు ఇంత పేరున్న‌వాడు కాదు. కానీ, ఇప్పుడు మాత్రం ప్ర‌పంచ చాంపియ‌న్. అందుక‌నే మెస్సీని భార‌త్ కు ర‌ప్పించ‌డం అంత క‌ష్టం అని చెప్పాల్సి వ‌స్తుంది. దీనిని స‌ఫ‌లం చేసిన ఈవెంట్ మేనేజ‌ర్ శ‌త‌ద్రు మాత్రం అనూహ్య పరిణామాలు ఎదుర్కొన్నాడు.

కోల్ క‌తా ర‌భ‌స‌..

గ‌త శ‌నివారం కోల్ క‌తాలో మెస్సీ టూర్ సంద‌ర్భంగా ర‌చ్చ‌ర‌చ్చ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. గోట్ టూర్ ఆఫ్ ఇండియాలో ఇదే మొద‌టి న‌గ‌రం. కానీ, మెస్సీ రాక స‌మ‌యంలో మైదానంలో తీవ్ర ఉద్రిక‌త్త నెల‌కొంది. స్టేడియంలోని కుర్చీల‌ను ధ్వంసం చేసిన అభిమానులు గంద‌ర‌గోళం రేపారు. దీంతో ఈవెంట్ నిర్వాహ‌కుడు శ‌త‌ద్రు చిక్కుల్లో ప‌డ్డారు. కోల్ క‌తా పోలీసులు అత‌డిని అరెస్టు చేశారు. కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌గా అత‌డికి 14 రోజుల క‌స్ట‌డీ విధించారు. ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది. కాగా, పోలీసులు సోమ‌వారం ఇద్ద‌రిని అరెస్టు చేశారు. మొత్తం అరెస్టు చేసిన‌వారి సంఖ్య ఐదుకు చేరింది. 15 రోజుల్లో ప్ర‌భుత్వానికి నివేదిక అంద‌జేయ‌నున్నారు.

ఢిల్లీలో మెస్సీ..

గోట్ మెస్సీ సోమ‌వారం ఢిల్లీలో భార‌త ప్ర‌ధాని మోదీని క‌ల‌వ‌నున్నాడు. ఎన్సీపీ ఎంపీ, భార‌త ఫుట్ బాల్ స‌మాఖ్య అధ్య‌క్షుడు అయిన‌ ప్ర‌ఫుల్ ప‌టేల్ తోనూ భేటీ అవుతాడు. చీఫ్ జ‌స్టిస్ సూర్య‌కాంత్, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదీల‌నూ మెస్సీ క‌లుస్తాడు. కోల్ క‌తాలోని సాల్ట్ లేక్, హైద‌రాబాద్ ఉప్ప‌ల్, ముంబై వాంఖ‌డేల‌లో సంద‌డి చేసిన మెస్సీ.. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో త‌ళుక్కుమ‌న‌నున్నాడు. అనంత‌రం సోమ‌వారం రాత్రి తిరుగు ప్ర‌యాణ‌మ‌వుతాడు. కానీ, అత‌డిని భార‌త్ కు తీసుకొచ్చిన శ‌త‌ద్రు.. ఈనెలాఖ‌రు వ‌ర‌కు పోలీస్ క‌స్ట‌డీలో గ‌డ‌ప‌నున్నాడు.

Tags:    

Similar News