బాబును ఒప్పించే పూచీ పవన్ పై పెట్టిన రోజా

Update: 2018-02-19 09:30 GMT
అంతేమరి ! ఏదో మీడియా తనకు ప్రాధాన్యం ఇస్తోంది కదాని.. ఓ మాట రువ్వేసి.. అక్కడితో వచ్చిన మైలేజీ చాలనుకుని.. ఇంటికెళ్లి తొంగుంటే సరిపోదు. తన మాట పట్ల రాజకీయ ప్రతిస్పందనలను కూడా గమనించాలి. తదనుగుణంగా తను కూడా పనిచేయాలి. అందుకే.. కేంద్రంలోని మోడీ సర్కారుపై అవిశ్వాసతీర్మానం పెట్టాలనే పనిని.. వైసీపీ, టీడీపీల చిత్తశుద్ధితో ముడిపెట్టిన పవన్ కల్యాణ్ కు, రోజా మరో మంచి పని పెట్టారు. అవిశ్వాసానికి అవసరమైన 54 మంది ఎంపీల బలాన్ని కూడగట్టేందుకు ఆయనకూడా పూనుకోవాలని, తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అంటున్నారు.

పవన్ కల్యాణ్ అవిశ్వాసం అనే ప్రతిపాదన చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కేంద్రం మీద అవిశ్వాసం పెట్టడం వల్ల.. మోడీ సర్కారు కూలడం జరగదు, అలాగే విభజన చట్టహామీలు గానీ, ప్రత్యేకహోదా గానీ వచ్చేయదు. కాకపోతే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ సర్కారు అన్యాయం చేస్తున్నదనే సంగతి దేశవ్యాప్తంగా తెలుస్తుంది. అందరూ దీని మీద చర్చించే పరిస్థితి వస్తుంది. ఈ వ్యూహంతో పవన్ ప్రతిపాదన చేస్తూ రెండు పార్టీల చిత్తశుద్ధిని దీనితో ముడిపెట్టారు.

అయితే పవన్ ఆ మాట అని 24 గంటలు కూడా గడవక ముందే జగన్ దానికి సానుకూలంగా స్పందించారు. తమ పార్టీ తరఫున అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ ఆయన స్పష్టం చేశారు. అయితే.. కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలంటే కనీసం 54 మంది సభ్యుల బలం ఉండాలి. అందుకోసం తెదేపా కూడా తమ ప్రతిపాదనకు మద్దతిస్తుందా? అని ఆయన ప్రశ్నించారు.

ఇప్పుడు రోజా తెరమీదకు వచ్చి.. పవన్ చెప్పిన మాటను జగన్ గౌరవించాడని, అవిశ్వాసానికి తాము సిద్ధంగా ఉన్నాం అని.. కానీ.. అందుకు అవసరమైన 54 మంది సభ్యుల మద్దతు దొరికేలా ఇతర పార్టీలతో దౌత్యం నెరపే బాధ్యతను పవన్ కల్యాణ్ తీసుకుంటారా? అని రోజా ప్రశ్నిస్తున్నారు. ఏపీకి మొత్తం ఉన్నదే 25 ఎంపీసీట్లు. అంటే మరో పెద్ద పార్టీ ఏదైనా గానీ .. ఈ అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తే తప్ప.. కనీసం ప్రతిపాదించడానికి అవకాశం లేదు. ఇలాంటి నేపథ్యంలో ఆ పూనిక పవన్ తీసుకుంటారా? ఆ రకంగా తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటారా? అనే చర్చను రోజా లేవనెత్తుతున్నారు.

తన పార్టీకి ఒక్క ఎంపీ కూడా లేరు గనుక.. పవన్ కల్యాణ్.. తను ఏదో ఒక సలహా చెప్పేసి ఊరుకోవడం చాలా ఈజీ. కానీ రోజా ప్రతిపాదన ప్రకారం.. కనీసం ఆయన తెదేపాను ఒప్పించే పని గానీ, శివసేన లాంటి భాజపా వ్యతిరేక పార్టీని కలిసి మద్దతు కోరే ప్రయత్నం గానీ చేయవచ్చు గదా అని ప్రజలు కూడా అనుకుంటున్నారు.
Tags:    

Similar News